Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల మాట‌: ప‌ద‌వులు ఇచ్చారు..ఫ‌లితమేంటి.. ?

రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు పెద్దగా సంతృప్తి చెందడం లేదన్నది తరచుగా వినిపిస్తున్న మాట.

By:  Garuda Media   |   20 March 2026 12:00 PM IST
త‌మ్ముళ్ల మాట‌: ప‌ద‌వులు ఇచ్చారు..ఫ‌లితమేంటి.. ?
X

రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు పెద్దగా సంతృప్తి చెందడం లేదన్నది తరచుగా వినిపిస్తున్న మాట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 1800 మందికి పైగా నామినేటెడ్ పదవులు పొందారు. కానీ వీరిలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు.. ఎంతమంది సంతోషంగా ఉన్నారు.. అంటే చెప్పటం చాలా కష్టం అని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్న వారిలో ఎక్కువమంది యాక్టివ్గా లేరన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. దీనికి ప్రధాన కారణం వారికి ఎలాంటి అధికారాలు లేకపోవడమే.

దీంతో పాటు కనీసం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి అన్నా కూడా వారు అధికారులకు చెప్పి అనుమతి పొందాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీనిపై తాజాగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు మంత్రి లోకేష్ కు సుదీర్ఘ లెటరు రాశారు. దీనిలో వారు కీలక అంశాలను ప్రస్తావించారు. తమకు పదవులు ఇచ్చారు కానీ ఎటువంటి అధికారాలు లేకుండా పోయాయని దీనివల్ల ఎటువంటి పనులు చేయాలన్నా.. అధికారులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారుల‌ నుంచి తాము అవమానాలు కూడా భరించాల్సి వస్తోందని ఒకరిద్దరు పేర్కొనడం అత్యంత కీలక విషయంగా మారింది.

ముఖ్యంగా వీరు కోరుకుంటున్నది కనీసం పదివేల రూపాయలు ఖర్చు పెట్టే లాగా అయినా తమకు చెక్ పవర్ ఇచ్చేలా చూడాలని విన్నవించారు. చైర్మన్‌గా తాము తలెత్తుకుని తిరుగుతామని, పనులు చేయించగలుగుతామని, అప్పుడే ఆ పదవికి కనీసం గౌరవం ఉంటుందని వారు చెప్పిన విషయం వెలుగు చూసింది. పదవీకాలం విషయంపై కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్ చైర్మన్ లకు రెండు సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. కానీ పదవి స్వీకరించి మధ్యలో కొంత మేరకు పనులు చేసి వాటిని ప్రారంభించే లోపే సమయం గడిచిపోతోంది.

కాబట్టి ఈ గడువును కనీసం మూడు సంవత్సరాలు పెంచాలనేది వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని కూడా తాజాగా మంత్రికి రాసిన శాఖలో ప్రస్తావించారు. అదేవిధంగా తమకు ఒక వ్యక్తిగత సహాయకుడిని ఏర్పాటు చేయాలని, కార్యాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేలాగా అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని కూడా విన్నవించారు. చాలావరకు మార్కెట్ యార్డ్ కమిటీలకు నిర్దేశించిన కార్యాలయాల్లో ఏసీ సౌకర్యం కూడా లేదని పేర్కొన్నారు. మొత్తంగా నామినేటెడ్ పదవులు పొందారు అన్న సంతోషం ఒకవైపు ఉన్నప్పటికీ మరోవైపు మాత్రం తమకు ఎటువంటి అధికారాలు లేకపోవడం పట్ల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వాస్తవం. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి లోకేష్ ఎలాంటి చొరవ తీసుకుంటారనేది చూడాలి.