Begin typing your search above and press return to search.

జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రజల రియాక్షన్ ఎలా ఉంది?

కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ సరిగా సాగలేదన్న విమర్శల గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Nov 2025 10:27 AM IST
జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రజల రియాక్షన్ ఎలా ఉంది?
X

కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ సరిగా సాగలేదన్న విమర్శల గురించి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ చిక్కుముడుల్ని విప్పదీసి.. ఒక క్రమపద్దతిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తాజాగా మూడు కొత్త జిల్లాల్ని.. ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే. మరి..దీనిపై ఏపీ ప్రజల స్పందన ఏంటి? వారెలా రియాక్టు అవుతున్నారు? లాంటి అంశాల్ని పరిశీలిస్తే.. తాజా నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

జిల్లాల పునర్విభజన.. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అంశంపై కొన్నిచోట్ల హర్షం వ్యక్తమవుతుంటే.. మరికొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మార్చిన వాటిపైనే కాదు.. మార్చని వాటిపైనా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు మదనపల్లె జిల్లాలో పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు.. చౌడేపల్లె.. సదుం.. సోమల మండలాల్ని కలపటంపై ఆ ప్రాంత ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. రొంపిచెర్ల.. పులిచెర్ల మండలాల్ని చిత్తూరు జిల్లాల్లో కంటిన్యూ చేస్తున్న అంశాన్ని పులిచెర్ల మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. రొంపిచెర్ల వాసులు మాత్రం తమకు పక్కనే ఉన్న పీలేరు రెవెన్యూ కేంద్రంలో కాకుండా చిత్తూరులో ఉంచటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం చిత్తూరు జిల్లాల్లో ఉన్న నగరి.. నిండ్ర.. విజయపురం మండలాల్ని తిరుపతి జిల్లాల్లో కలిపేస్తామని సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేశ్ లు హామీ ఇచ్చారు. తిరుపతిలో కలపాలని క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సిఫార్సు చేసింది కానీ అమలు కాకపోవటంపై మూడు మండలాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాలు మార్పులు చేర్పులపై మొత్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రకాశంతో పాటు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయటంపై ఓకే అని చెబుతుంటే.. కనిగిరి డివిజనన్ లో కలపటంపై మాత్రం గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మదనపల్లె జిల్లాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతూ.. అందరూ హ్యాపీ అన్నట్లుగా రియాక్షన్ వస్తోంది. నెల్లూరుకు దూరంగా గూడూరు.. వెంకటగిరి ఉన్నట్లుగా చెబుతున్నారు. మడకశిర డివిజన్ పై సానుకూలత వ్యక్తమవుతుంటే.. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్ని అన్నమయ్య జిల్లాలో చేర్చటంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గన్నవరం.. పెనమలూరు నియోజకవర్గాల్నిఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న మాట వినిపిస్తోంది.

గూడురు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు.. లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలుకాకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. తొలి నుంచి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగిన నేపథ్యంలో విద్య.. వైద్యం.. వ్యాపార సంబందాలు ఎక్కువ. దీంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అదే సమయంలో లాజిస్టిక్స్ పరంగా చూసినా.. గూడూరు నుంచి నెల్లూరు 36కిలోమీటర్లు అయితే.. తిరుపతి 110 కి.మీ. ఇలా ఏ యాంగిల్ లో చూసినా తిరుపతి జిల్లాలోకొనసాగటం అసౌకర్యంగా ఉందన్న మాట వినిపిస్తోంది.

నెల్లూరు పరిధిలోని కలువాయి.. సైదాపురం.. రాపూరు మండలాల్ని తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మూడు మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలువాయి నుంచి నెల్లూరుకు 70కి.మీ అయితే గూడురు 80కి.మీ. జిల్లా కేంద్రమైన తిరుపతి ఏకంగా 160కి.మీ. దూరంలో ఉంది. రావూరు నుంచి నెల్లూరుకు 60కి.మీ. అయితే తిరుపతికి 90కి.మీ. ఇక.. సైదాపురం విషయానికి వస్తే నెల్లూరుకు 50కి.మీ. దూరంలో ఉంటే అదే తిరుపతి అయితే ఏకంగా 130కి.మీ. ఉంది. దీంతో ఈ మూడు మండలాల్ని నెల్లూరులోనే కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.

క్రిష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం.. పెనమలూరు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయకపోవటంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెనమలూరు పరిధిలోని పెనమలూరు, కంకిపాడు మండలాలలోని గ్రామాలు గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. గ్రేటర్‌లో విలీనం కావని తెలిసినా.. ఎన్టీఆర్‌ జిల్లాలో కలవకపోయినా.. ఈ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో కడప జిల్లావాసులకు ఒంటిమిట్టతో విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒంటిమిట్ట మండల కేంద్రం నుంచి కడపకు 25 కి.మీ. ఉంది. అన్నమయ్య జిల్లాకు మార్చడంతో రాయచోటికి పోవాలంటే 90 కి.మీ ప్రయాణించాలి. రెండు బస్సులు మారాలి. సిద్దవటం, ఒంటిమిట్టలను కడప జిల్లాలోనే కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. మరి.. ఈ మార్పులు చేర్పులపై కూటమి సర్కారు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.