డిసెంబర్ నాటికల్లా ఏపీలో కొత్త జిల్లాలు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉన్న జిల్లాల మీద మార్పులు చేర్పుల విషయంలో కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
By: Satya P | 13 Sept 2025 2:00 AM ISTఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉన్న జిల్లాల మీద మార్పులు చేర్పుల విషయంలో కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రి వర్గ సంఘానికి వినతులు సూచనలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 13 జిల్లాలను కాస్తా 26 జిల్లాలుగా చేశారు. అయితే వాటి మీద జనాలలో అసంతృప్తి ఉంది. తమ ప్రాంతాన్ని వేరేగా ఉంచారని కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలు మార్చాలని మరి కొన్ని చోట్ల, తమ నియోజకవర్గాలను వేరుగా ఉంచారని ఇంకొన్ని చోట్ల అసంతృప్తులు వచ్చాయి. అలాగే చిరకాల డిమాండ్లు కూడా కొత్త జిల్లాల మీద ఉన్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నది కూడా ఉంది. దాంతో నాడు విపక్షంలో ఉన్న టీడీపీ తాము అధికారంలోకి వస్తే కనుక కొత్త జిల్లాలలో లోపాలను సరిచేస్తామని అందరితో చర్చించి సమగ్రంగా రూపిందిస్తామని కూడా పేర్కొంది.
మంత్రి వర్గ ఉప సంఘంతో ముందుకు :
కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాలు మార్పులు చేర్పులు అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఇక ప్రతీ జిల్లాలో కలెక్టర్లు కూడా జిల్లాల మార్పులు చేర్పుల మీద జనం నుంచి వినతులు తీసుకుంటున్నారు. వీటిని మంత్రివర్గ ఉప సంఘం పూర్తి స్థాయిలో పరిశీలించనుంది. సాధ్యమైనంత తొందరలోనే ప్రభుత్వానికి ఉప సంఘం నివేదికను సమర్పిస్తుందని అంటున్నారు.
ఈ ఏడాదిలోనే :
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా జనాభా గణన 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 మధ్యలో జరగనుంది. దాంతో ఈ మధ్యలో జిల్లాల కానీ మండలాలు కానీ నియోజకవర్గాలలో కానీ ఏ రకమైన మార్పులు చేర్పులు చేయరాదు, అలాగే పేర్లు కూడా మార్చరాదు. అలాగే సరిహద్దులు కూడా అలాగే ఉంచాలి. అంటే ప్రభుత్వానికి కచ్చితంగా ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా మాత్రమే సమయం ఉంది. అందువల్ల కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల విషయంలో వేగం పెంచింది అని అంటున్నారు. మంత్రి వర్గ ఉప సంఘం నుంచి నివేదికలు వచ్చిన వెంటనే వాటిని అసెంబ్లీలో ప్రవేఅశపెట్టి ఆమోదించడం ద్వారా కొత్త జిల్లాల స్వరూప స్వభావాలను నిర్ణయించి అమలులోకి తెస్తారు అని అంటున్నారు.
కొత్త జిల్లాగా అమరావతి :
రాజధానిగా ఉన్న అమరావతిని కొత్త జిల్లాగా చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. మరి అమరావతి జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఉంటాయని చూస్తే కనుక అమరావతి పరిధిలోని మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట వంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి అమరావతి జిల్లాగా చేస్తారు అని అంటున్నారు. అంటే అమరావతిలో మొత్తం అయిదు నియోజకవర్గాలు ఉంటాయని చెబుతున్నరు. ఇక గుంటూరు జిల్లా చూస్తే కొంత చిన్నదిగా మారుతుంది అని అంటున్నారు. ఆ జిల్లాలో గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలుగా ఉంటాయని చెబుతున్నారు.
కొత్త జిల్లాలుగా ఇవే :
ఎన్న్నాళ్ళుగానో డిమాండ్ గా ఉన్న మార్కాపురం జిల్లాను చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం ప్రత్యేక జిల్లాగా చేసి అందులో గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి వంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతారు ఐఅ అంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలపాలని కూడా చూస్తున్నారు. ఆ విధంగా చేస్తేనే ఏ రకమైన ఇబ్బంది లేకుండా పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుందని అంటున్నారు.
అల్లూరి నుంచి వేరు చేసి :
మరో వైపు చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం చాలా దూరంగా ఉన్నందువల్ల రంపచోడవరం కేంద్రంగా జిల్లా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. రంపచోడవరం ప్రాంతాల వారు జిల్లా కలెక్టరేట్ కోసం అయినా పనుల కోసం అయినా తమ ప్రాంతానికి దాదాపుగా 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు వెళ్లాల్సి వస్తోంది అంటున్నారు. దాంతో ఇక్కడ కూడా కొత్త జిల్లా రాబోతోంది. రంపచోడవరం, చింతూరు డివిజన్లతో కలిపి ఈ జిల్లా రానుంది అని అంటున్నారు.
నియోజకవర్గాలు విలీనం :
ఇక ఒక జిల్లాలో ఉన్న నియోజకవర్గాలను మరో జిల్లాలలో విలీనం చేసే ప్రక్రియ కూడా చేపడుతున్నారు. అలా విశాఖ జిల్లాలోకి విజయనగరం జిల్లాకు చెందిన ఎస్ కోట రానుంది. అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయని చెబుతున్నారు. అదే విధంగా మండపేటను తూర్పుగోదావరిలో, రామచంద్రపురంను కాకినాడ జిల్లాలో చేర్చే అవకాశం ఉంఅని చెబుతున్నారు. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో చేర్చాలని చూస్తున్నారని ప్రచారంలో ఉంది. ఈ కొత్త జిల్లలా ఏర్పాటు కానీ మార్పులు చేర్పులు కానీ పూర్తిగా పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నారు అని అంటున్నారు.
