Begin typing your search above and press return to search.

మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు.. అక్టోబరులో నోటిఫికేషన్!

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ తాజాగా వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించనున్నారు.

By:  Tupaki Desk   |   22 Sept 2026 9:04 PM IST
మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు.. అక్టోబరులో నోటిఫికేషన్!
X

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ తాజాగా వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించనున్నారు. వీటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు 9 రోజుల గడువు విధించారు. దీంతో ఈ నెలాఖరులో ఎన్నికల సన్నాహాక కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబరు తొలివారంలో రిజర్వేషన్లను ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వం శరవేగంగా ఎన్నికలకు అడుగులు వేస్తుండగా, బీసీ రిజర్వేషన్ల పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయని అంటున్నారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉండటంతో ఎవరైనా కోర్టుకు వెళితే పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియలో కీలక అడుగు పడినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో వార్డులకు మాత్రమే రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఈ ప్రాసెస్ ద్వారా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్లను గుర్తించనున్నారని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ బుధవారం నుంచి మూడు రోజులు పాటు జరుగుతుంది. దీనికోసం సంబంధిత సిబ్బంది డోర్ టు డోర్ సర్వే నిర్వహించనున్నారు. ఎన్నికల రోల్ ను వార్డు, పోలింగ్ స్టేషన్ వారిగా విభజించి ఓటర్లను గుర్తిస్తారని అధికారులు చెబుతున్నారు.

ఎస్టీ ఓటర్లను ఆకుపచ్చ బాల్ పాయింట్ పెన్ తోనూ, ఎస్సీ ఓటర్లను రెడ్ బాల్ పాయింట్ పెన్ తో గుర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, బీసీ ఓటర్లను బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ తో గుర్తించి, ఎస్సీ, ఎస్టీ, మహిళ, బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాలను సెప్టెంబర్ 26న మున్సిపల్, రెవెన్యూ డివిజన్, తహసిల్దార్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డుల్లో ఉంచుతారు. 27, 28 తేదీల్లో అభ్యంతరాలు, కెయిములు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఫారం 2 ద్వారా క్లెయిములు, ఫారం 3 ద్వారా అభ్యంతరాలను దాఖలు చేయాలి. క్లెయిములు, అభ్యంతరాలపై అబ్జెక్షన్ ఉంటే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు.

29, 30 తేదీల్లో విచారణ నిర్వహించి ముసాయిదా జాబితాను సవరిస్తారు. అక్టోబర్ 1న ఎస్సీ, ఎస్టీ, మహిళ ఓటర్ల తుది వార్డు వారి జాబితాలను ఫారం 6 లో ప్రచురించి మునిసిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ కు అందజేస్తారు. బీసీ ఓటర్ల జాబితాకు కూడా ఇదే షెడ్యూలు వర్తిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం తొమ్మిది రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు అవరోధం కావచ్చునున్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

న్యాయపరమన చిక్కులు తప్పవా?

మున్సిపాలిటీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవో న్యాయపరంగా నిలబడదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్ల శాతం 50 కు మించకూడదు. అయితే, ఇప్పుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంతో ఇది 54 శాతానికి చేరుతుంది. దీనివల్ల న్యాయపరమైన అవరోధాలు ఏర్పడి మొత్తం ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నార్ధకంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాల్సివుందని అంటున్నారు.