సీక్రెట్.. సస్పెన్స్.. కూటమిలో సీట్ల సర్దుబాటుపై అస్పష్టత
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. 16వ తేదీ శుక్రవారం నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు.
By: Tupaki Political Desk | 15 Oct 2026 5:00 PM ISTరాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. 16వ తేదీ శుక్రవారం నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమిలో సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఎక్కడా లేని ఉత్కంఠకు గురిచేస్తోందని అంటున్నారు. ఏ పార్టీ ఏయే స్థానం నుంచి పోటీ చేయాలన్న విషయమై రెండు రోజులుగా ఎడతెగని విధంగా చర్చలు జరిపినా, చివరికి ఒక అవగాహనకు రాలేకయారని, అందుకే అంతా కలిసి పోటీ చేస్తామన్న ప్రకటన మాత్రమే విడుదల చేశారని అంటున్నారు.
రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలపై కూటమిలోని మూడు పార్టీల మధ్య తీవ్ర చర్చలు జరిగినా ఏకాభిప్రాయం లభించలేదన్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. అందుకే ఏ పార్టీ ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని అంటున్నారు. కూటమిలో కీలక భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీ 40 శాతం సీట్లు తమ వాటాగా కావాలని కోరడంతో ఈ పరిస్థితి నెలకొందని అభిప్రాయపడుతున్నారు. జనసేన కోరినన్ని సీట్లు ఇవ్వలేమని టీడీపీ స్పష్టం చేయగా, అంతకు తగ్గితే అంగీకరించేది లేదని జనసేన పట్టుబట్టిందని బుధవారం రోజంతా ప్రచారం జరిగిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తులపై స్పష్టత రాకపోవడం, కూటమి ఐక్యత దెబ్బతింటోదన్న ప్రచారం జరిగే ప్రమాదం ఉన్నందున చివరగా, అంతా కలిసిపోటీచేస్తామన్న ఏకైక అంశమే ప్రాతిపదికగా తీసుకుని జనసేన నేతల ద్వారానే సర్దుబాట్లు కొలిక్కివచ్చాయని ప్రకటన చేయించారని విశ్లేషిస్తున్నారు.
గెలుపే ప్రాతిపదికగా పోటీ చేస్తాం.. కూటమిగానే ఉంటామని జనసేన నేతలు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ, జనసేన పార్టీ తరఫున ఎన్నిచోట్ల పోటీ చేస్తారనే స్పష్టత ఇవ్వకపోడంతో ఆ పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొందని అంటున్నారు. నిజానికి జనసేనకు కేటాయించే సీట్లపై కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తల్లో ఉత్కంఠ కొనసాగిందని అంటున్నారు. జనసేనను సంతృప్తి పరిచితే బీజేపీని ఒప్పించడం కష్టమేమీ కాదని, దీనిద్వారా టీడీపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చేస్తుందని అభిప్రాయం వ్యక్తమైందని అంటున్నారు.
అయితే జనసేన తమకు 40 శాతం వాటా కావాలని ఒకసారి, 6 కార్పొరేషన్లు, 38 మున్సిపాలిటీలు అంటూ మరోసారి 29 మున్సిపాలిటీలతో సరిపెట్టుకుంటామని మరోసారి చర్చలను ముందుకు వెళ్లకుండా చేసిందని అంటున్నారు. దీంతో ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని, ఏకాభిప్రాయం లేనిచోట స్నేహపూర్వక పోటీకి సిద్ధమవ్వాలని సంకేతాలు పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అప్పటివరకు బెట్టు చేసిన జనసేన వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. దీంతోనే ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే అంశంపై అధికారికంగా ప్రకటన రాలేదని అంటున్నారు. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లుగా 4 కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీల్లో జనసేన పోటీ అనేది కేవలం మీడియా ఊహాగానాలుగానే చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు పోటీ చేయాలన్న అంశాన్ని మున్సిపాలిటీలు, నియోజకవర్గ నేతలకు వదిలేసినట్లుగా చెబుతున్నారు.
ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం మేరకు టీడీపీ ఉన్నచోట ఆ పార్టీ నేతలు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట ఆ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారని, అంతా కలిసి ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేస్తారని అంటున్నారు. ఎవరికి ఎన్నిసీట్లు అన్న అంకెలు మాత్రం బయట పెట్టకూడదని, మూడు పార్టీలు కలిపి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి కూటమి అభ్యర్థులుగానే ప్రచారం చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీంతో అభ్యర్థుల ప్రకటన తర్వాత వారు ఏ గుర్తుపై పోటీ చేస్తారన్న విషయం బయటపెడితే కానీ సీట్ల సర్దుబాటు అంకెలపై స్పష్టత రాదని అంటున్నారు.
