తెలంగాణా రిజల్ట్ : ఏపీలో వైసీపీ సంగతేంటి ?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తన రాజకీయ దూకుడుని స్పష్టంగా ప్రదర్శించి ఆధిక్యతను చాటుకుంది.
By: Satya P | 14 Feb 2026 4:00 AM ISTతెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తన రాజకీయ దూకుడుని స్పష్టంగా ప్రదర్శించి ఆధిక్యతను చాటుకుంది. పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటిన కాంగ్రెస్ మునిసిపల్ ఎన్నికల్లోనూ అదే తీరున తన బలాన్ని ప్రదర్శించింది. ఈ నేపధ్యంలో విపక్షాలు బాగా తగ్గిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రేసులో కాస్తా వెనకనైనా తాము కూడా ఉన్నామని బీఆర్ ఎస్ నిరూపించుకుంది. అధికారంలో ఉన్న పార్టీతో ఎన్నికల్లో పోరు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, అక్కడికి 15 దాకా మున్సిపాలిటీలను సొంతంగా గెలుచుకుంది అంటే బీఆర్ఎస్ రాజకీయ తెగువను మెచ్చుకోవాల్సిందే అని అంటున్నారు. అలాగే ఏడు వందలకు పైగా వార్డులను దక్కించుకుంది.
ఏపీ మీద ప్రభావం :
ఇక తెలంగాణా ఏపీ రెండూ పుష్కర కాలం క్రితం ఒక్కటే అన్న సంగతి తెలిసిందే. అక్కడ ఫలితాల ప్రభావం ఏపీ మీద కూడా కచ్చితంగా పడతాయి. తెలంగాణాలో 2023లో కేసీఆర్ ఓటమి పాలు అయ్యారు. ఏపీలో 2024లో వైసీపీ ఓటమి చెందింది. ఉప ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో వరస ఓటములు బీఆర్ఎస్ ని వెంటాడుతున్నాయి. మరి ఏపీలో కూడా వైసీపీ 2024 తరువాత పెద్దగా ఏ ఎన్నికలనూ ఫేస్ చేయలేదు, కానీ పులివెందులలో జగన్ సొంత ఇలాకాలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అప్రతిహత విజయం సాధించింది. దాంతో పాటు ఆ పక్కన ఉన్న మరో జెడ్పీటీసీ ని సొంతం చేసుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఏడాది ఏపీలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో ఈ ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
మందీ మార్బలం ఉన్నా :
తెలంగాణాలో బీఆర్ఎస్ మందీ మార్బలంతో బలంగానే ఉంది. ఆ పార్టీకి కేసీఆర్ అనే రాజకీయ దిగ్గజ నేత నాయకత్వం ఉంది. అలాగే కేటీఆర్, హరీష్ రావు వంటి జంట నాయకత్వాలు కూడా ఉన్నాయి. ఇక సీనియర్ నేతలు ఎంతో మంది ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. పార్టీని నిరంతరం జనంలో ఉంచుతున్నారు అసెంబ్లీకి వెళ్తున్నారు అక్కడ కూడా కాంగ్రెస్ ని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ కి జనాలు రెండు సార్లు పట్టం కట్టారు, 2023లో ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు. ఇక బీఆర్ ఎస్ ఎంతలా కాంగ్రెస్ ని నిలువరిస్తుందో అంతా చూస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ విజయాలను ఆపలేకపోతోంది. బీఆర్ఎస్ తో పోలిస్తే ఏపీలో వైసీపీ సంస్థాగతంగా బలహీనంగానే ఉంది అని అంటున్నారు. పైగా ఏక నాయకత్వమే ఉంది. అసెంబ్లీలో విపక్ష హోదా లేదు, ఉన్న 11 మంది సభకు గైర్ హాజరు అవుతున్నారు జగన్ మాట్లాడకపోతే ఎవరూ స్పందించే సీన్ లేదు, పార్టీని సొంతం చేసుకుని ముందుకు వచ్చే వారు బహు తక్కువ. వ్యూహాల లేమి వైసీపీకి మరో సమస్య. సెల్ఫ్ గోల్ వేసుకునే నాయకులే ఎక్కువ.
పుర పోరులో గెలిచేది :
ఈ విధంగా ఉన్న వైసీపీ రాజకీయ నేపథ్యంలో ఏపీలో మునిసిపల్ ఎన్నికలు వస్తే గెలిచేది ఎవరు అన్న చర్చ వస్తోంది. ఏపీలో మూడు పార్టీలతో కూటమి బలంగా ఉంది. దాంతో సాలిడ్ ఓటు షేర్ మెజారిటీగా ఆ వైపు మళ్ళుతుంది. పైగా అధికారంలో ఉన్న పార్టీ. ఇక వైసీపీ విషయానికి వస్తే అధికార కూటమిని నిలువరించి బరిలో నిలబడగలరా అన్న చర్చ కూడా వస్తోంది. గట్టిగా నిలబడితే చాలు వైసీపీకి ఎంతో కొంత బలం వస్తుంది అని అంటున్నారు. కానీ కూటమి జోరుని చూసి వైసీపీలో పోటీకి ఎంతమంది సిద్ధపడతారు అని అంటున్నారు. పైగా అధికారంలో ఉన్న పార్టీకే స్థానిక ఎన్నికల్లోనూ జనాలు జై కొడతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో పుర పోరులో నిలిచి గెలిచేందుకు వైసీపీ ఇప్పటి నుంచే భారీ వ్యూహాలతో అన్ని రకాల అస్త్రాలతో సిద్ధం కావాల్సి ఉంది అని అంటున్నారు.
