కమ్మ-కాపు.. వసంత కృష్ణప్రసాద్ చెప్పిన కొత్త అర్థం ఇదే..
కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆయన కాపులతో బంధం మరింత బలపడేలా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
By: Tupaki Political Desk | 11 Nov 2025 1:59 PM ISTఏపీలో రెండు ప్రధాన సామాజిక వర్గాలైన కమ్మ, కాపులపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు సామాజికవర్గాల మధ్య పెద్దగా తేడా ఏమీ లేదన్న ఎమ్మెల్యే.. తన చిన్నతనంలో పేదవారైన కమ్మలను కాపులని.. ఆస్తిపరులైన కమ్మలను మాత్రమే కమ్మలని పిలిచేవారని వెల్లడించారు. తన సొంత నియోజకవర్గం మైలవరంలో నిర్వహించిన కాపు సామాజికవర్గ సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్యే చేసిన ఈ వైఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభానును వచ్చే ఎన్నికల తర్వాత మంత్రి అవుతారంటూ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ జోస్యం చెప్పారు.
ముక్కుసూటిగా మాట్లాడే నేతగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు గుర్తింపు ఉంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆయన కాపులతో బంధం మరింత బలపడేలా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ రెండు సామాజికవర్గాల మధ్య కొన్ని దశాబ్దాలుగా రాజకీయ ఆధిపత్యం పోరాటం కొనసాగుతోంది. అయితే గత ఎన్నికల్లో ఈ రెండు సామాజికవర్గాలు చేతులు కలపడంతో భారీ విజయం నమోదుచేశాయి. మరోవైపు ఈ రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చు రాజేలా ఇటీవల కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కాపుల సమావేశానికి వెళ్లి, ఆ సామాజికవర్గం నేతల మద్దతు కోరేలా మాట్లాడం ఆకట్టుకుందని అంటున్నారు.
‘‘రెండు కులాల మధ్య నిజంగా తేడా లేదు. మేము తరతరాలుగా సోదరులుగా జీవించాము. కానీ రాజకీయ కుట్రలు మమ్మలి్న విడదీశాయి’’ అంటూ గతంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ఎమ్మెల్యే పరోక్షంగా ప్రస్తావించారని అంటున్నారు. ఇప్పుడు మన పిల్లలను ఏకం చేయడం, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం మన సమష్టి బాధ్యతగా ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ సమావేశంలో జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభానుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఉదయభాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అవుతారని జోస్యం చెప్పారు.
ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తాజా వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. ఏపీ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయాల్లో మూడు ప్రధాన సామాజికవర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు సామాజికవర్గాలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించినట్లు విశ్లేషిస్తున్నారు. ఈ బంధం కలకాలం కొనసాగేలా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వంటివారు చొరవ తీసుకుంటున్నారని అంటున్నారు.
