Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే సౌమ్యకు 739వ ర్యాంకు

అవును టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఏపీ లాసెట్ లో 739 ర్యాంకు సాధించారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 7:00 PM IST
టీడీపీ ఎమ్మెల్యే సౌమ్యకు 739వ ర్యాంకు
X

రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 739 ర్యాంకు రావడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మీ డౌటు నిజమే కావొచ్చు. కానీ, నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు మాత్రం 739 ర్యాంకు వచ్చింది. అంతేకాకుండా ప్రజాప్రతినిధిగా ఉంటూ ఆ ర్యాంకు సాధించడంపై ఆమె అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవును టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఏపీ లాసెట్ లో 739 ర్యాంకు సాధించారు. గత నెలలో ఎంట్రన్స్ పరీక్ష రాసిన ఆమె 95 మార్కులు రాసి 739 ర్యాంకు తెచ్చుకున్నారు. తన తండ్రి దివంగత నేత తంగిరాల ప్రభాకర్ రావు మాదిరిగా న్యాయవాద విద్యను అభ్యసించాలనే కోరికతో సౌమ్య లాసెట్ రాశారు.

తండ్రి ప్రభాకర్ రావు మరణంతో 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సౌమ్య, ప్రస్తుతం రెండో సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా ఆమెకు ప్రభుత్వ విప్ పదవిని కూడా అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చదువుతున్న సమయంలో తండ్రి మరణంతో ఆకస్మికంగా రాజకీయ ప్రవేశం చేసిన సౌమ్య దాదాపు పదేళ్లుగా రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపారు. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల తరపున పలు పోరాటాలు చేశారు. ప్రధానంగా అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలను అడ్డుకోవడంలో సౌమ్య చాలా తెగువ ప్రదర్శించేవారు.

ఈ క్రమంలో ప్రజాప్రతినిధిగా బిజీగా ఉంటున్న సౌమ్య మనసు రాజకీయాలపై నుంచి మళ్లీ చదువుపైకి మళ్లింది. ముఖ్యంగా ప్రజా జీవితంలో న్యాయపరమైన అవగాహన ఎక్కువగా ఉండాల్సిరావడంతో లా చదవాలని సౌమ్య నిర్ణయించుకున్నారు. ఆమె తండ్రి ప్రభాకర్ రావు కూడా మంచి న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే మరణించడంతో సౌమ్య రాజకీయాల్లోకి రావాల్సివచ్చింది. తండ్రి ఆశయాలు కొనసాగించాలనే నిర్ణయంతో రాజకీయాల్లోకి వచ్చిన సౌమ్య, ఆయనలా న్యాయ విద్య అభ్యసించాలని నిర్ణయించుకుని ప్రవేశ పరీక్ష రాశారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ చదవాలని ఆమె నిర్ణయించడం మంచి మార్కులు సాధించి మెరుగైన ర్యాంకు తెచ్చుకోవడంపై సౌమ్యను అంతా అభినందిస్తున్నారు.