ఏపీలో టాప్ 10 బెస్ట్ ఎమ్మెల్యేలు వీరే.. లిస్టులో బాలయ్య నెంబర్ ఎంతో తెలుసా..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరుపై వివిధ సంస్థలు సర్వేలు చేస్తున్నాయి.
By: Tupaki Political Desk | 15 Jun 2026 7:00 PM ISTకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరుపై వివిధ సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాలన ఎలా ఉంది? నియోజకవర్గాల్లో అభివృద్ధి? ఎమ్మెల్యే పనితీరు వంటి విషయాలపై క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ స్వయంగా కొన్ని సర్వేలు చేయించుకుంటుండగా, మరికొన్ని సంస్థలు స్వతంత్రంగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రైస్ అనే సంస్థ కూడా నియోజకవర్గాల వారీగా సర్వే చేసినట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరుపై మదింపు చేసిన రైస్ సంస్థ.. టాప్ టెన్ ఎమ్మెల్యేల పేర్లు ప్రకటించింది. ఇందులో ప్రముఖ సినీ నటుడు, నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా చోటు దక్కించుకున్నారు.
ప్రజాప్రతినిధుల పనితీరును అంచనా వేయడానికి రైస్ సంస్థ కొన్ని కీలకమైన శాస్త్రీయ సూచీలను పరిగణలోకి తీసుకుని సమాచారం సేకరించినట్లు రైస్ ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేల నాయకత్వ పటిమ, నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడంలో స్థానిక యంత్రాంగాన్ని సమన్వయం చేసే విధానాన్ని పరిశీలించినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, నియోజకవర్గాల అభివృద్ధిలో చూపిన చొరవ వంటి ఫలితాల ఆధారిత ప్రజాసేవను కొలమానంగా తీసుకున్నామని చెబుతున్నారు. వీటికి తోడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం, పారదర్శకమైన బాధ్యతాయుతమైన సుపరిపాలన అందిస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండటాన్ని ప్రధాన సూచీలుగా పరిగణించి ఈ ర్యాంకులను కేటాయించారు.
'రైస్' సర్వే సమగ్ర నివేదిక ప్రకారం విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రథమ స్థానంలో నిలిచారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన గద్దె తన పనితీరుతో ఏపీలోనే అత్యుత్తమ ఎమ్మెల్యేగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన వేగం ఈ ర్యాంకుకు కారణమని చెబుతున్నారు. ఆయన తర్వాత వరుసగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వితీయ స్థానంలో నిలవగా, పాలకొల్లు ఎమ్మెల్యే, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. వీరితో పాటు మద్దిపాటి వెంకటరాజు (గోపాలపురం), పల్లా శ్రీనివాస్ (గాజువాక), కె. వెంకట ప్రసాద్ (కదిరి), సుజనా చౌదరి (విజయవాడ పశ్చిమ), నందమూరి బాలకృష్ణ (హిందూపురం), బేబీ నాయన (బొబ్బిలి),యరపతినేని శ్రీనివాస్ (గురజాల) టాప్ 10 అత్యుత్తమ ఎమ్మెల్యేల జాబితాలో నిలిచారు.
ఈ సర్వే నివేదిక కేవలం టాప్ 10 ఎమ్మెల్యేల ప్రతిభను మెచ్చుకోవడమే కాకుండా, ఆసక్తికర వివరాలను బయటపెట్టారు. పారదర్శకమైన సుపరిపాలనను అందిస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజల దరికి చేర్చడంలో పదిమంది ఎమ్మెల్యేలు మిగిలిన వారికంటే చాలా ముందున్నారని రైస్ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో కూటమికి కంచుకోటలుగా భావించే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలడం గమనార్హం. ఈ ప్రాంతాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవడం కూటమి ప్రభుత్వానికి ఒకింత ఆందోళన కలిగించే విషయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, రెండేళ్ల పాలన ముగిసిన నేపథ్యంలో వచ్చిన ఈ 'రైస్ సర్వే 2026' ఫలితాలు ఏపీ ఎమ్మెల్యేలందరికీ ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాంటివని వ్యాఖ్యానిస్తున్నారు. టాప్ 10 లో నిలిచిన వారు తమ స్థానాన్ని కాపాడుకోవాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మిగిలిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా అలర్ట్ కావాలని ఈ నివేదిక హెచ్చరిస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
