మంత్రుల్లో 'ఫస్ట్ బెస్ట్' మూడు స్థానాలూ వారివే!
తాజాగా చేపట్టిన సర్వేలో తొలి మూడు స్థానాలు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లే దక్కించుకున్నారు.
By: Tupaki Desk | 21 Jun 2025 4:09 AMఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మం త్రుల విషయంలో వారి స్పందన ఎలా ఉంది? అనే విషయాలపై తాజాగా చేపట్టిన సర్వేలో తొలి మూడు స్థానాలు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లే దక్కించుకున్నారు. మొత్తం 25 మంది మంత్రుల పనితీరుపై ఈ సర్వే ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. దీనిలో ప్రజలు తెలిపిన అభిప్రాయం మేరకు.. ఆరుగురు మంత్రుల పనితీరు బాగుంది. మరో 9 మంది పనితీరు ఫర్వాలేదన్నట్టుగా ఉంది.
కానీ, మరో 10 మంది మంత్రుల పనితీరుపై ప్రజలు పెదవి విరిచారు. వీరి జాబితాను కూడా సర్వే సంస్థ వెల్లడించడం గమనార్హం. దీని ప్రకారం.. మంత్రుల పనితీరు బాగుందన్న జాబితాలో తొలి మూడు స్థానాల్లో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉన్నారు. సీఎం చంద్రబాబు విషయంలో ప్రజలు ముక్తకంఠంతో ఆయన బాగా పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిరంతరం రాష్ట్రం కోసం పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. ఇక, ప్రజల సమస్యల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన బాగుందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా అభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కూడా దాదాపు సమానంగానే మార్కు లు పడ్డాయి. ప్రజల మధ్య ఉండే ముఖ్యమంత్రిగా చంద్రబాబు 99 శాతం మంది ప్రజలు అనుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం విషయంలో 82 శాతం మంది ఆయన ప్రజల మధ్య ఉంటున్నారని తెలిపారు. ఇక, మంత్రి నారా లోకేష్ పనితీరుపై కూడా మెజారిటీ ప్రజలు సానుకూలంగా స్పందించారు. తన శాఖలతోపాటు.. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. నారా లోకేష్ బాగా స్పందిస్తున్నారని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.
వీరి తర్వాత పనితీరు బాగున్న మంత్రుల్లో వరుసగా.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జలవనరుల శాఖ మం త్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. రాజధాని అమరావతి విషయంలో నారాయణ బాగా కష్టపడుతున్నారని.. వివాద రహితంగా ఉన్నారని ప్రజలు పేర్కొన్నారు. ఇక, వరదలు, విపత్తుల సమయంలో మంత్రి నిమ్మల స్పందన బాగుందని ప్రజలుతెలిపారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో పయ్యావుల కేశవ్ పైనా సానుకూల స్పందన ఉండడం గమనార్హం. ఇక, మిగిలిన వారిలో 9 మందిని ఫర్వాలేదని చెప్పారు. ఈ జాబితాలో కీలకమైన హోం మంత్రి వంగల పూడి అనిత ఆరోస్థానంలో ఉండడం గమనార్హం.