'గద్ద ముక్కు పంతులు' ఏపీ మంత్రి సుభాష్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం
ఇటీవల తన కులం చూసే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, మంత్రి పదవి రావడానికి కులమే కారణం అన్నట్లు వ్యాఖ్యలు చేసిన మంత్రి సుభాష్.. తాజాగా బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 19 Nov 2025 6:37 PM ISTఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఇటీవల తన కులం చూసే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, మంత్రి పదవి రావడానికి కులమే కారణం అన్నట్లు వ్యాఖ్యలు చేసిన మంత్రి సుభాష్.. తాజాగా బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పేరు పెట్టకపోయినా ఆయన చేసిన విమర్శలు నేరుగా ఆయనను కించపరిచేవిగా ఉన్నాయంటూ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు.
‘‘ఏపీకి చెందిన శెట్టి బలిజలు హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆ టీఆర్ఎస్ గద్దముక్కు పంతులు శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చాడు’’ అంటూ మంత్రి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శెట్టి బలిజలను ఓసీల్లో కలపడం వల్ల వేల మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయని భావితరాల వారి భవిష్యత్తు పాడైపోయిందని మంత్రి సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నాయి.
ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలాగేనా మాట్లాడతారా? అంటూ బీఆర్ఎస్ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హోదాలో ఉండి ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని ఆక్షేపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేతను వాడు, వీడు అంటూ సంబోధించడం సరికాదని హితవు పలుకుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఏపీకి చెందిన కొన్ని బీసీ కులాలను వెనుకబడిన వర్గాల జాబితా నుంచి తొలగించారు. దీంతో అప్పటి నుంచి ఏపీలోని బీసీలుగా చెలమణి అయ్యే కులాలు తెలంగాణలో ఓసిలుగా పరిగణిస్తున్నారు.
కల్లుగీత కార్మిక వర్గానికి చెందిన శెట్టి బలిజలు ఉమ్మడి గోదావరి జిల్లాలో అధికంగా ఉంటారు. ఈ ప్రాంతంలో కాపులతో సమానంగా శెట్టి బలిజలు ఉండటంతో వారికి అన్ని రకాలుగా ప్రాధాన్యం లభిస్తోంది. అయితే తెలంగాణకు వచ్చేసరికి శెట్టి బలిజలకు అలాంటి గుర్తింపు లభించకపోవడంతో వారిలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. దీంతోనే ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రి సుభాష్ ఆయా వర్గాలను ఆకట్టుకోడానికి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
