Begin typing your search above and press return to search.

వైద్య విద్య‌లో దుమారం: ఏపీలో ఏం జ‌రిగింది ..!

రాష్ట్రంలో వైద్య విద్యకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగింది. వైసిపి హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీ లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోంది.. అన్నది ప్రధాన విమర్శ.

By:  Tupaki Desk   |   9 Sept 2025 12:00 PM IST
వైద్య విద్య‌లో దుమారం:  ఏపీలో ఏం జ‌రిగింది ..!
X

రాష్ట్రంలో వైద్య విద్యకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగింది. వైసిపి హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీ లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోంది.. అన్నది ప్రధాన విమర్శ. దీనిపై వైసీపీ నాయకుల నుంచి కమ్యూనిస్టుల వరకు కూడా విమర్శలు చేస్తున్నారు. దీనిని ప్రభుత్వం సమర్ధించుకుంటున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ప్రైవేట్ కి అప్పగించడం వల్ల ఒరిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రభుత్వమే తీసుకుని ఉంటే వచ్చే మేలు ఏమిటి? అనేది ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్య కళాశాలల అనుమతులు తెచ్చుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. గతంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక్క వైద్య కళాశాలను కూడా ఆ రాష్ట్రానికి మంజూరు చేయలేదు. అటువంటి సమయంలో వైసీపీ అధినేత అప్పటి సీఎం జగన్ కేంద్రాన్ని ఒప్పించి ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక వైద్య కళాశాల ఉండాలని అప్పటి ప్రభుత్వ లక్ష్యం.

దీనిలో భాగంగానే 17 మెడికల్ కాలేజీ లను తీసుకువచ్చారు. వీటిలో ఐదు మెడికల్ కాలేజీలను అప్పట్లో పూర్తి చేశారు. వీటికి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కూడా అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం వీటిలో తరగతులు జరుగుతున్నాయి. ఇక మిగిలిన 12 మెడికల్ కాలేజీల పరిస్థితి డోలాయమానంలో పడింది. అప్పటి ప్రభుత్వం వీటికి భూములు కేటాయించినప్పటికీ నిధులు లేకపోవడంతో నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు మూలన పడ్డాయి. అయితే విడతల వారీగా వీటిని పూర్తి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల గడువు విధించింది.

రెండు సంవత్సరాల గడువు పూర్తయింది. మరో మూడు సంవత్సరాల్లో వీటిని నిర్మించుకునే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం వీటి నిర్మాణానికి 6000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతాయని అంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి ప్రైవేటుకు ఇస్తే త్వరగా నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వస్తాయన్నది ఆలోచన. ఇదే ఇప్పుడు విమర్శలకు దారితీసింది. వాస్తవానికి ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పటికే వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్మిషన్ల నుంచి ర్యాంకుల వరకు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

దీనికి తోడు పేద విద్యార్థులు చదువుకునే అవకాశం ప్రైవేటు మెడికల్ కాలేజీలలో ఉండడం లేదు. దీనివల్లే ఉక్రెయిన్ సహా ఇతర దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి కష్టాలు తొలగించాలన్న ఉద్దేశంతోనే వైసిపి 17 మెడికల్ కాలేజీల్లో తీసుకువచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వీటిని ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదనల దశలోనే ఉంది. అయితే దీన్ని వెనక్కి తీసుకోవాలని ప్రైవేటుకు ఇవ్వకూడదు అన్నది వైసీపీ సహా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు వైద్య విద్యార్థులు కూడా ఈ విషయంపై ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. రాజధాని అమరావతికి లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయలు వెచ్చించలేదా అనేది ప్రధాన ప్రశ్న. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వాదన మరోరకంగా ఉంది. దీంతో ఈ వివాదం ఎప్పటి వరకు కొనసాగుతుంది.. అసలు వీటిని ప్రైవేటుకు ఇవ్వటం వెనక ఆంతర్యం ఏమిటి అనేది చూడాల్సి ఉంది.