బాబు ఊహించిందే నిజమైంది.. వైసీపీ కోర్టుకెక్కింది!
ఏపీ సీఎం చంద్రబాబు ఊహించిందే జరిగింది!. స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరులో నిర్వహించాలని బాబు నిర్ణయించారు.
By: Garuda Media | 27 Aug 2026 8:00 AM ISTఏపీ సీఎం చంద్రబాబు ఊహించిందే జరిగింది!. స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరులో నిర్వహించాలని బాబు నిర్ణయించారు. తద్వారా.. కేంద్రం ఇచ్చే 16వ ఆర్థిక సంఘం నిధులను తీసుకురావాలని లెక్కలు వేసుకున్నారు. సుమారు 12 వేల కోట్ల రూపాయల మేరకు ఆయా పంచాయతీలు, నగర పాలక సంస్థలకు ఈ నిధులు అందనున్నాయి. తద్వారా పనులు వేగంగా చేసేందుకు.,. అభివృద్ధి బాట పట్టించేందుకు అవకాశం ఉంటుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరు నాటికి నోటిఫికేషన్ ఇచ్చేసి.. ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేశారు.
అయితే.. ఈ ఎన్నికల ప్రక్రియకు, కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థిక సంఘం నిధులకు వైసీపీ అడ్డుతగిలే అవకాశం ఉందని బాబు ఇటీవల అంచనా వేసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రులకు కూడా చెప్పారు. ``వైసీపీ అడ్డుపడే అవకాశం ఉంది. దీనిపై మనం ఆలోచన చేయాలి. కోర్టుకు వెళ్తారో.. లేక కేంద్రం వద్ద అడ్డు పెడతారో చూడాలి.`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన వేసిన అంచనా అక్షరాల నిజమైంది. తాజాగా వైసీపీ స్థానిక ఎన్నికల విషయంపై హైకోర్టును ఆశ్రయించింది. అక్టోబరు 3వ తేదీకి ముందే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉందని.. దీనిని అడ్డుకోవాలని కోరింది.
దీనికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను వైసీపీ బూచిగా చూపించింది. ఈ ఏడాది సర్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా పూర్త యిందని.. ఈ క్రమంలో 40 లక్షల మందికిపైగా ఓట్లను తొలగించారనితెలిపింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి తుది ఓటర్ల జాబితా అక్టోబరులో ప్రకటించనున్నారని పేర్కొంది. ఆ జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర సర్కారును , రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించాలని కోరుతూ.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు విచారణకు స్వీకరించింది.
అయితే.. వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా.. స్థానికసంస్థల్లో ఎవరికీ అన్యాయం జరగబోదని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి ఎవరికి ఓటు హక్కు ఉంటే వారంతా స్థానిక ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం ఇస్తామని.. అది అన్నా పార్టీలకు(వైసీపీ సహా) మేలు చేస్తుందని చెబుతోంది. కానీ, వైసీపీ వ్యూహం వేరేగా ఉంది. అక్టోబరులోగా ఎన్నికలు జరగకపోతే.. కేంద్రం నుంచి వచ్చే సుమారు 12 వేల కోట్ల రూపాయలు రద్దయిపోతాయి. తద్వారా.. ప్రభుత్వం ఇరుకున పడుతుంది. ఇదే ఇప్పుడు వైసీపీ లక్ష్యంగా ఉందని.. అందుకే కోర్టు మెట్లు ఎక్కిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
