Begin typing your search above and press return to search.

ఏపీలో కూట‌మి పార్టీలు... స్థానిక స‌మ‌రం ..!

స్థానిక ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయిన నేప‌థ్యంలో కూట‌మి పార్టీల్లో పోటీ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

By:  Garuda Media   |   20 July 2026 11:14 AM IST
ఏపీలో కూట‌మి పార్టీలు... స్థానిక స‌మ‌రం ..!
X

స్థానిక ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయిన నేప‌థ్యంలో కూట‌మి పార్టీల్లో పోటీ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన క‌లిసి అధికారం పంచుకున్నా.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌ర్దుబాటు ధోర‌ణితో ముందుకు సాగినా.. ఇప్పుడు వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో మాత్రం ఈ స‌ర్దుబాటు వ్య‌వ‌హార‌మే రాజ‌కీయంగా పార్టీల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. త‌మ‌కు ఇన్ని సీట్లు కావాల్సిందేన‌ని ఏ పార్టీకి ఆ పార్టీ భీష్మించే ప‌రిస్థితి వ‌చ్చింది. అంతేకాదు.. ఎవ‌రికి వారు త‌మ స్థానిక నాయ‌కుల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

జ‌న‌సేన నేత, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా బీజేపీలోనూ ఇదే ధోర‌ణి కొన‌సాగుతోంది. విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ''మ‌నం కీల‌క రోల్ పోషించాలి. విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర‌లో బీజేపీ ఎదిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. రాజీ ధోర‌ణి వ‌ద్దు'' అంటూ.. పార్టీ నాయ‌కుల‌కు ఆయన‌ తేల్చి చెప్పారు. అంటే.. స్థానిక ఎన్నికల్లో కావాల్సిన‌న్ని సీట్లు తీసుకోవాల్సిందేన‌న్న ధోర‌ణిని ఆయ‌న వినిపించారు.

ఇక‌, జ‌న‌సేన‌లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల సంఖ్య బ‌లం పెంచుకునేందుకు.. వారి సేవ‌ల‌ను గుర్తించేందుకు స్థానిక ఎన్నిక‌లు కీల‌క‌మ‌ని భావిస్తున్న నాయ‌క‌త్వం.. ఈ ఎన్నిక‌ల్లో ఎక్కువ స్థానాలు ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదే విష‌యాన్ని మ‌నోహ‌ర్‌చెప్పుకొచ్చారు. మ‌రోవైపు.. టీడీపీ నేత‌ల నుంచి కూడా ఇదే త‌ర‌హా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలా.. మూడు పార్టీల్లోనూ స్థానిక స‌మ‌రంపై ఎవ‌రికి వ్యూహాలు వారికి ఉన్నాయి. దీంతో స్థానికంలో స‌ర్దుబాటు వ్య‌వ‌హారం చాలా సంక్లిష్టంగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. పార్టీ అధిష్టానాలు మాత్రం క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. టీడీపీని ఆయ‌న కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, బీజేపీ, జ‌న‌సేన‌ల్లో మాత్రం ఇలాంటి ప‌ర‌స్థితి కొంత మేర‌కు త‌గ్గింద‌నే చెప్పాలి. ఈ రెండు పార్టీల్లోనూ ఆశావ‌హుల సంఖ్య‌తోపాటు.. పార్టీల విస్త‌ర‌ణ అంశం కూడా కీల‌కంగా మార‌డంతో స్థానిక ఎన్నిక‌ల‌ను కొల‌మానంగా తీసుకుంటున్న క్షేత్ర‌స్థాయి నాయ‌కులు పోటీకి సై అంటున్నారు. దీంతో స్థానిక ఎన్నిక‌ల్లో మూడు పార్టీల మ‌ధ్య మ‌రింత స‌మ‌న్వ‌యం తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఉంది.