Begin typing your search above and press return to search.

జనసేన అంతంతమాత్రం.. బీజేపీ నామమాత్రం.. కూటమి లెక్కలు ఆసక్తికరం

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు హాట్ టాపిక్ అవుతోంది.

By:  Tupaki Desk   |   29 Oct 2026 2:40 PM IST
జనసేన అంతంతమాత్రం.. బీజేపీ నామమాత్రం.. కూటమి లెక్కలు ఆసక్తికరం
X

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు హాట్ టాపిక్ అవుతోంది. నామినేషన్లకు ముందు తమకు భారీగా సీట్లు కావాలని, బలం ఉన్న ప్రతిచోటా పోటీ చేస్తామని గంభీరమైన ప్రకటనలు చేసిన బీజేపీ, జనసేన పార్టీలు తుది లెక్కలకు వచ్చేసరికి తేలిపోయినట్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా తమకు 30 శాతం వాటా ఇవ్వాలని హడావుడి చేసిన జనసేన నేతలు, గ్రామాల వరకు వచ్చేసరికి చేతులెత్తేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ అయితే అక్కడక్కడ మాత్రమే పోటీలో నిలబడి తానూ ఉన్నానని చాటుకునే ప్రయత్నం మాత్రమే చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా కూటమిలో ప్రధాన పక్షం టీడీపీ హవానే ఎక్కువగా ఉందని ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా స్పష్టం చేస్తోందని చెబుతున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏకగ్రీవాలు మినహాయిస్తే పోటీ జరుగుతున్న మొత్తం స్థానాల్లో టీడీపీ 6,423 ఎంపీటీసీ స్థానాల్లో బరిలో నిలిచింది. అంటే మొత్తం స్థానాల్లో 65 శాతం టీడీపీ వాటాగా చెబుతున్నారు. ఇదే సమయంలో జనసేన 1,521 చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులను నిలిపి 15 శాతంతో సరిపెట్టుకుందని అంటున్నారు. అదేవిధంగా బీజేపీ కేవలం 285 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. సుమారు 2.90 శాతం వాటా మాత్రమే తీసుకుందని విశ్లేషిస్తున్నారు. ఇక జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 452, జనసేన 109, బీజేపీ 34 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. వరుసగా మూడు పార్టీలు 68.59 శాతం, 16.54 శాతం, 5.16 శాతం స్థానాలు తీసుకున్నాయని చెబుతున్నారు.

టీడీపీ హవా

రాష్ట్రంలో మొత్తం 9829 ఎంపీటీసీ స్థానాలు, 659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే, 1985 ఎంసీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 77 జడ్పీటీసీ స్థానాలు పోటీ లేకపోవడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ స్థానాలు మినహాయిస్తే 7844 ఎంపీటీసీ స్థానాలు, 582 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో టీడీపీ అత్యధికంగా 6423 చోట్లో పోటీ చేస్తూ కూటమిలో తమ పార్టీకి ఎదురులేనట్లు సంకేతాలిచ్చింది. ఇదేసమయంలో జనసేన, బీజేపీ నేతలు పొత్తుల్లో వెనకబడినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్ణయించిన నిష్పత్తి ప్రకారం క్షేత్రస్థాయిలో సీట్లు సర్దుబాటు జరగాలని మూడు పార్టీల అగ్ర నాయకత్వం నుంచి సూచనలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు కారణంగా అమలు చేయలేకపోయారని అంటున్నారు. ప్రధానంగా జనసేన, బీజేపీకి క్షేత్రస్థాయిలో సమర్ధులైన నాయకుల కొరత, ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం కారణంగా టీడీపీ అడ్వాంటేజ్ తీసుకున్నట్లు చెబుతున్నారు.

జనసేనకు నిరాశేనా..

స్థానిక ఎన్నికల్లో తమ బలం ఉన్న ప్రతిచోట పోటీ చేస్తామని హడావుడి చేసిన జనసేన నేతలు జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో వెనక్కి తగ్గడంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జనసేన నుంచి 15 నుంచి 16 శాతం మాత్రమే నామినేషన్లు వేయడం చూస్తే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఇంకా పుంజుకోలేదన్న విషయాన్ని బయటపెడుతోందని అంటున్నారు. కేడర్ గట్టిగా ఉన్న చోట మాత్రమే జనసేన అభ్యర్థులకు అవకాశం ఇచ్చారని, అంతంత మాత్రం ప్రజాదరణ ఉన్న వారికి, ఆర్థిక బలం లేనివారికి అస్సలు అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఉండటం వల్ల అర్థబలం, అంగబలం బేరీజు వేయడం వల్ల జనసేన నాయకులు ఎక్కువ చోట్ల వెనక్కి తగ్గాల్సివచ్చిందని అంటున్నారు. ఇక బీజేపీ పరిస్థితి మరింత తీసికట్టుగా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులపై చూపిన మక్కువ క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ కోసం ప్రదర్శించకపోవడం వల్ల స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ గట్టిగా వాదించలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ కారణంగానే సీట్ల సర్దుబాటులో జనసేన, బీజేపీ నాయకులను ఆత్మరక్షణలోకి నెట్టేసి టీడీపీ పైచేయి సాధించిందని విశ్లేషిస్తున్నారు.