Begin typing your search above and press return to search.

కూటమి స్థానిక ఎత్తులు...వైసీపీ తట్టుకుంటుందా ?

గతంలో వైసీపీ అనుసరించిన విధానమే ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అచ్చంగా అమలు చేయాలని చూస్తోంది.

By:  Satya P   |   17 July 2026 4:24 AM IST
కూటమి స్థానిక ఎత్తులు...వైసీపీ తట్టుకుంటుందా ?
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచిన కూటమికి ఇపుడు మరో కీలక ఎన్నికలు స్థానిక ఎన్నికలు అని చెప్పాలి. అయితే అపుడు విపక్షంలో ఉంటూనే అధికారంలో ఉన్న వైసీపీని ఓడించింది. దాంతో ఇపుడు అధికారం చేతిలో ఉంది. కూటమితో పటిష్టంగా ఉంది. దాంతో మరింత సులువుగా స్థానిక ఎన్నికలను గెలుచుకోవాలని చూస్తోంది. అయితే తేలికగా ఈ ఎన్నికలను తీసుకోవడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించిన అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తోంది. వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వరాదని కూడా గట్టిగా నిర్ణయించుకుంది అంటున్నారు.

ఏకగ్రీవాలతోనే :

గతంలో వైసీపీ అనుసరించిన విధానమే ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అచ్చంగా అమలు చేయాలని చూస్తోంది. దశల వారీగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో వీలైనన్ని ఏకగ్రీవాలని ప్రోత్సహించాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా చేస్తే మెజారిటీ సీట్లు ఎన్నికలకు ముందే తమ హస్తగతం అవుతాయని ఆ మిగిలినవి కూడా సునాయాసంగా గెలుచుకుంటే విజయం సంపూర్ణం అవుతుందని కూడా లెక్క వేస్తున్నారు. దాని కోసం తగిన వ్యూహాలను రూపొందిస్తున్నారు అని అంటున్నారు.

వైసీపీలో నిర్లిప్తత :

ఇక కూటమి పెద్దల ఆలోచనలకు వైసీపీలో ఉన్న నిర్లిప్తత కూడా అవకాశం కల్పిస్తోంది అని అంటున్నారు. వైసీపీలో నాయకత్వ లేమి చాలా చోట్ల ఉంది. పైగా ఉన్న నాయకులు కూడా ఎటూ అధికార పక్షానిదే పైచేయి అని ముందే ప్రిపేర్ అయి ఉన్నారని అంటున్నారు. పైగా తాము డబ్బు తీసి శ్రమ పడి కూటమికి ఎదురునిలబడడం ఈ సమయంలో మేలేనా అన్న చర్చ కూడా చాలా మంది చేస్తున్నారు అని అంటున్నారు. కూటమి ఇంకా మరో మూడేళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి ఢీ అంటే ఢీ కొడితే తమకు ఇబ్బంది అవుతుంది అనుకుంటున్న వారూ ఉన్నారని చెబుతున్నారు.

బలం బలగం తోనే :

సాధారణంగా ఏకగ్రీవాలు అన్నీ బలం బలగం తోనే జరుగుతాయి. అవతల పక్షాన్ని నామినేషన్ దాఖలు చేయనీయకుండా అడ్డుకుంటే చాలు ఆ సీటు ఏకగ్రీవం అయినట్లే. దీనికి సామదానభేద దండోపాయాల మంత్రం ఎటూ ఉంది. దాంతో కూటమి పెద్దలు ఇపుడు స్థానిక పోరులో పదునైన వ్యూహాలు రచిస్తున్నారు అని అంటున్నారు. ప్రత్యర్థికి ఏ మాత్రం చోటు లేకుండా చేయాలన్నదే ఆ పధక రచన సారాంశం అని అంటున్నారు.

వైసీపీ అధినాయకత్వం హెచ్చరికలు :

ఇక వైసీపీ అధినాయకత్వం చూస్తే గట్టి హెచ్చరికలనే జారీ చేసింది. ఆ మధ్యన వైసీపీ అధినేత జగన్ అయితే ఎక్కడా ఏకగ్రీవం అన్న మాట వింపించరాదు అని తమ పార్టీ వారిని ఆదేశించారు. ప్రతీ చోటా వైసీపీ జెండా రెపరెపలాడాల్సిందే అని ఆయన గట్టిగానే చెప్పారు. అన్ని చోట్ల నుంచి నామినేషన్లు పడి తీరాలని ఆయన ఆదేశించారు. ఈ విషయంలో ఎవరూ తలొగ్గరాదని కోరారు. మొత్తం అసెంబ్లీ ఇంచార్జిల మీదనే ఆయన ఈ బాధ్యతలను మోపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పనితీరే ఇంచార్జిలకు కొలమానంగా చూస్తామని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. దాంతో వైసీపీ హైకమాండ్ అయితే గట్టిగానే ఉంది. మరి కూటమి ఏకగ్రీవాల ఎత్తుగడలను తట్టుకుని నిలువరించి బరిలో నిలిచే సత్తా వైసీపీకి గ్రౌండ్ లెవెల్ లో ఏ మేరకు ఉంది అన్నది ఎన్నికలు మొదలయ్యాక మాత్రమే తెలుస్తుంది అని అంటున్నారు.