Begin typing your search above and press return to search.

పల్నాడు నుంచి పులివెందుల వరకు.. జగన్ సహా వైసీపీ కీలక నేతలపైనే కూటమి గురి

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతోంది.

By:  Tupaki Desk   |   28 Oct 2026 6:00 PM IST
పల్నాడు నుంచి పులివెందుల వరకు.. జగన్ సహా వైసీపీ కీలక నేతలపైనే కూటమి గురి
X

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సహా ఆయనకు కుడి ఎడమ భుజాలుగా ఉన్న సీనియర్ నేతలపైనే గురిపెట్టింది. పల్నాడు నుంచి రాయలసీమ వరకు మున్సిపాలిటీలు, మండలాలు, జిల్లా పరిషత్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా విపక్ష నేతలకు స్పష్టమైన సంకేతం పంపిందని అంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాలకు చెందిన వైసీపీ సీనియర్ నేతలను కూటమి నేతల విషయంలో కాస్త పట్టువిడుపులు ప్రదర్శించారని అంటున్నారు. రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో ఏకగ్రీవ ఎన్నికలకు సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించిందని అంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 76 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయితే అందులో 75 రాయలసీమ, పల్నాడు జిల్లాల్లోనే ఉండటం గమనించాల్సిన విషయమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరె డ్డితో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలకు చెక్ చెప్పేలా స్థానిక ఎన్నికల్లో కూటమి నేతలు వ్యూహం రచించారని చెబుతున్నారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పుంగనూరు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన మాచర్ల, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహించిన నగరి వంటి నియోజకవర్గాలు, ఆయా జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలను ముగించడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలతో రివేంజ్ తీసుకునేలా ఆయా స్థానాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా కూటమి నేతలు పావులు కదిపారని అంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో 17 చోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే, ఇవన్నీ రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీలే కావడం గమనార్హం. పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి చెందిన గురజాల నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని జనసేన దక్కించుకుందని చెబుతున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లాలోని బద్వేలు, ప్రొద్దుటూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు మున్సిపాలిటీలతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి గట్టిపట్టున్న పుంగనూరు, రాయచోటి, రాజంపేట మున్సిపాలిటీలను ఏకపక్షంగా కూటమి దక్కించుకోవడం ద్వారా రాయలసీమ వైసీపీ నేతలకు గట్టి సంకేతాలు పంపిందని అంటున్నారు.

ఇక జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం అమలు చేసిందని అంటున్నారు. మొత్తం 659 స్థానాల్లో 76 స్థానాలు ఏకగ్రీవం చేసుకుంది. ఇందులో కోస్తా జిల్లాల్లోని ఏలూరులో ఒకే ఒక్క జడ్పీటీసీ స్థానం ఉంది. మిగిలిన 75 స్థానాలు పల్నాడు నుంచి రాయలసీమ జిల్లాల వరకు ఉన్నవేనని చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 39 స్థానాలు ఉంటే అందులో 28 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 28 స్థానాలకు 18 చోట్ల పోటీ లేకుండా కూటమి తన ఖాతాలో వేసుకుంది. దీనిద్వారా ఆ రెండు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులు కూటమికే దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా మాజీ సీఎం జగన్ తోసహా మిగిలిన రాయలసీమ నేతలకు గట్టి సవాల్ విసిరిన కూటమి ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాల నేతలకు మాత్రం పోటీకి అవకాశం ఇవ్వడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.

సహజంగా కోస్తాలో ఎన్నికలు ఏకపక్షంగా ముగిసే వాతావరణాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదని, అందుకే కూటమి నేతలు ఆచితూచి వ్యవహరించారని అంటున్నారు. రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో దశాబ్దాలుగా ఉన్న సంస్కృతి కారణంగా అక్కడి ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉందన్న ఆలోచనతో కాస్త దూకుడుగా వెళ్లేందుకు కూటమి నేతలు సాహసించారని అంటున్నారు. ఈ కారణంగానే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ ఏకగ్రీవ ఎన్నికలు రాయలసీమతోపాటు పల్నాడు జిల్లాల్లో నమోదయ్యాయని విశ్లేషిస్తున్నారు.