ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భారీ ఆధిక్యం సాధించడంపై రాజకీయ చర్చ కొనసాగుతోంది. కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం 25 శాతం వరకు ఉందని చంద్రబాబు పేర్కొనగా, వైసీపీ పోటీకి అవకాశం లేకుండా చేశారని పేర్ని నాని ఆరోపించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజల పూర్తి అభిప్రాయాన్ని ప్రతిబింబించవని, అసలు తీర్పు 2029 ఎన్నికల్లోనే వెల్లడవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
By: Satya P | 11 Nov 2026 7:18 AM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసాయి. మొత్తంగా చూస్తే పట్టణాలలో 98 లక్షల ఓటర్లు ఉంటే 62 లక్షల మంది ఓటు వేశారు. పరిషత్తు ఎన్నికల్లో రెండున్నర కోట్ల మంది ఓటర్లు ఉంటే కోటిన్నర మందికి పైగా ఓటు వేశారు. ఇది ఒక అంచనా. మొత్తంగా చూస్తే మూడున్నర కోట్ల మంది ఎన్నికల్లో పాలు పంచుకున్నారు అని ఒక లెక్క ఉంది. ఇదిలా ఉంటే మూడు కోట్ల మందికి పైగా ఓటర్లు ఇచ్చిన తీర్పు మీద ఏపీలో రకరకాలైన చర్చ సాగుతోంది. విశ్లేషణలు కూడా రాజకీయంగా ఎవరికి తోచిన తీరున వారు చేస్తున్నారు.
అంత వ్యత్యాసం ఉంటుందా :
ఇక టీడీపీ అధినేత కూటమి పెద్దన్న అయిన చంద్రబాబు అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి వైసీపీకి మధ్య ఓటు షేర్ చూస్తే ఏకంగా పాతిక శాతం దాకా ఉందని చెప్పారు. అవన్నీ అంకెలతో సహా ఆయన వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే లెక్క కరెక్ట్ గానే ఉంది. అయితే అదే రోజున వైసీపీ మాజీ మంత్రి సీనియర్ నేత పేర్ని నాని అయితే మీడియా సమావేశం పెట్టి మరీ కూటమి మీద విమర్శలు చేశారు. వైసీపీకి ఎక్కడ పోటీ చేయించారు అని ఆయన మండిపడ్డారు. అనేక చోట్ల వైసీపీ పోటీలోనే లేకుండా చేశారు అన్నారు. అలాగే పులివెందుల లాంటి చోట్ల దొంగ ఓట్లు వారే వేసుకుని గెలిచారు అని కూటమి మీద విరుచుకుపడ్డారు.
తీర్పు తిరుగులేనిదేనా :
ఇవన్నీ పక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన తీర్పు తిరుగులేనిది గానే చూడాలా అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దేశంలో ఎక్కడ జరిగినా అధికార పార్టీకే పట్టం కడతాయి. అది ఆనవాయితీ. అంతే కాదు ప్రజలు ఎక్కడ ఉన్నా అభివృద్ధి కోరుకుంటారు. అలా అధికారంలో ఉన్న పార్టీతో తామూ నడవాలని చూస్తారు. ఇంకా సగం పాలన ఉంది కాబట్టి అభివృద్ధి ఫలాలు తమ ప్రాంతానికి రావాలని అనుకుంటారు. అంత తేలికగా వారు బయట పడరు అని కూడా అంటూంటారు. అందుకే ప్రజలు వేసే ఓటు అధికార పార్టీకే కచ్చితంగా ఉంటుందని అంటారు. ఇక ఎటూ అధికార పార్టీకే అండదండలు ఉంటాయి, మందీ మార్బలం ఉంటుంది కాబట్టి మరింత అడ్వాంటేజ్ వారికి ఉంటుంది అని అంటారు. ఆ మీదట విపక్షం గట్టిగా పోరాటం చేయని చోట కానీ లేదా వారు ఉదాశీనంగా ఉన్న చోట కానీ ఫలితాలు అధికారం వైపే ఉంటాయని అంటారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా అధికార పక్షం గెలుపు అన్నది సర్వ సాధారణమే కానీ అరుదైనది కాదనే అంతా అంటారు.
జనం చెప్పేది ఎప్పుడు :
నిజానికి రాజకీయ నాయకులు తెలివైన వారు అనుకుంటారు. కానీ ఎంతో బలవంతులైన వారిని ఓడించిన ప్రజలే అసలైన తెలివైన వారు అని అంటారు. ప్రజలు కూడా ఎపుడు ఎక్కడ ఎలా తమ ఓటు ద్వారా విలక్షణ తీర్పు ఇవ్వాలో బాగా తెలిసిన వారు అని అంటారు. ఇక లోకల్ ఎలక్షన్స్ కి రాష్ట్ర ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య తేడా కూడా కచ్చితంగా జనాలకు తెలుసు అని అంటారు. అందుకే స్థానిక ఎన్నికల్లో ఫలితాలు జనం అంతరంగాన్ని పెద్దగా బయటపెట్టలేదని కూడా విశ్లేషిస్తున్నారు. మరి వారు ఎపుడు తమ అసలైన తీర్పు ఇస్తారు అంటే అది 2029 సాధారణ ఎన్నికల్లోనే అని అంటున్నారు. అంతే ఆ ఎన్నికల్లోనే జనాలు తాము ఏమనుకుంటున్నది చెబుతారు అన్న మాట. అంతవరకూ జనం గుప్పిట మూసే ఉంచారు అని అంటున్నారు. సో ఈ తీర్పు అయితే కొలమానం అవుతానా కాదా అంటే విజయం ఎపుడూ ఉత్తేజమే కాబట్టి కూటమికి అది సానుకూలంగా ఉపయోగపడవచ్చు ఇక వైసీపీకి ఆత్మ విమర్శకు పనికి రావచ్చు అని అంటున్నారు.
