Begin typing your search above and press return to search.

స్థానికంపై ఎన్నో సందేహాలు.. అంతుచిక్కని ప్రభుత్వ ఆలోచనలు

ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి ఎక్కువైంది. వచ్చేనెలలో మూడు రకాల స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   23 Sept 2026 8:00 PM IST
స్థానికంపై ఎన్నో సందేహాలు.. అంతుచిక్కని ప్రభుత్వ ఆలోచనలు
X

ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి ఎక్కువైంది. వచ్చేనెలలో మూడు రకాల స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. నవంబరు నెలాఖరులోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలనే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఎన్నిరకాలుగా సన్నద్ధం అవుతున్నా, ఎన్నికలకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. బీసీ రిజర్వేషన్‌లను 34 శాతం చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఈ మేరకు రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగం అనుమతించదని చెబుతున్నారు. దీంతో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో పంచాయతీలు, మున్సిపల్ పాలకవర్గాలకు మూడు నెలల క్రితమే గడువు ముగిసింది. గురువారంతో జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాలకు గడువు తీరిపోతుంది. దీంతో ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారు చేయడంతోపాటు వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్‌లను 34 శాతం పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. దీనిప్రకారం చూస్తే మొత్తం రిజర్వేషన్లు 54 శాతానికి చేరుకుంటాయని అంటున్నారు. ఇది సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని అంటున్నారు. తెలంగాణలో సైతం ఇదే విధంగా 50 శాతం దాటి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రయత్నించగా, కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రకటన రద్దు చేసిందని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణలో ఎదురైన అనుభవంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళుతుందనేది అంతుచిక్కడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బీసీలకు 34 శాతం వార్డులను రిజర్వు చేసేలా అధికారులు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎవరైనా ఈ విషయంలో కోర్టుకు వెళితే అప్పుడు పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనేది చూడాల్సి వుందని అంటున్నారు. ఈ విషయంపై స్పష్టత వస్తేనే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనేది తేలుతుందని అంటున్నారు. అయితే రిజర్వేషన్ పెంపును కోర్టు అనుమతించని పక్షంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇలా ప్రభుత్వం ఆలోచన మార్చుకున్నా వెంటనే ఎన్నికలు నిర్వహించే వాతావరణం కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు బీసీలకు 34 శాతం కోటా కింద వార్డు రిజర్వేషన్లు ప్రకటిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతున్నందున కోర్టు నిర్ణయం కూడా ఎన్నికల నిర్వహణను ప్రభావితం చేయొచ్చని అంటున్నారు. భవిష్యత్తులో కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని హామీ ఇచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఏదిఏమైనా న్యాయపరమైన చిక్కులు స్థానిక ఎన్నికల నిర్వహణపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిర్వహణకే కట్టుబడినట్లు ఉందని అంటున్నారు. రాష్ట్రంలో 50 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడంతోపాటు రెండేళ్లుగా విడుదల చేయని పింఛన్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడం ఇందులో భాగమే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.