సీట్ల సర్దుబాటు ...15న కూటమి పార్టీల మీట్ ?
ఏపీలో స్థానిక సంస్థల వేడి రాజుకుంది. అయితే సాధారణంగా ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ముందుగా తమ ఆసక్తిని వ్యక్తం చేస్తారు. అలా కూటమిలోని మూడు పార్టీలలో ఔత్సాహికులు తమ అభిలాషను వ్యక్తం చేస్తున్నారు.
By: Satya P | 11 Sept 2026 7:30 AM ISTఏపీలో స్థానిక సంస్థల వేడి రాజుకుంది. అయితే సాధారణంగా ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ముందుగా తమ ఆసక్తిని వ్యక్తం చేస్తారు. అలా కూటమిలోని మూడు పార్టీలలో ఔత్సాహికులు తమ అభిలాషను వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారికంగా ఎవరూ బయటకు చెప్పలేకపోతున్నారు. దానికి కూడా కూటమిగా ఉండడం. ఎవరికి వారుగా ముందుగా ప్రకటించుకోవద్దని తమ పార్టీల నాయకులకు కూటమి పార్టీల అధినాయకత్వాలు హెచ్చరించిన నేపథ్యం ఉంది. అదే సమయంలో సీట్లు ఎవరికి ఎంత శాతం అన్న లెక్క ముందు తేల్చుకోవాలని చూస్తున్నారు. ఐక్యంగా పోటీ చేయడానికే కూటమి పార్టీలు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. దాంతో సర్దుబాటు కోసం సీట్ల విషయంలో చర్చకు మూడు పార్టీల అధినాయకత్వాలు కలిసి చర్చించడానికి సిద్ధపడుతున్నాయి.
పవన్ వస్తున్నారు :
ఇక కూటమి పార్టీలలో ముఖ్యమైన మిత్ర పక్షం జనసేన. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్ళిన సంగతి విధితమే. ఆయన ఇపుడు అక్కడే ఉన్నారు. ఆయన ఎపుడు వస్తారు అంటే ఎవరికి వారికి ఊహాగానాలు ఉన్నాయి. అయితే తాజాగా జనసేన పార్టీ సామావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ నెల 15న పవన్ వస్తారు అని చెప్పడం జరిగింది. ఆయన పార్టీ ఆఫీసుకి వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల మీద సమీక్షలు నిర్వహిస్తారు అని చెప్పారు. పవన్ బీ ఫారాలు ఇస్తారని ఆయన సంతకం చేసిన బీ ఫారాలు ఉన్న వారే అభ్యర్ధులుగా ఉంటారని ఈ లోగా ఎవరు పోటీ చేస్తామని ప్రకటించుకున్నా అది తొందరపాటు వ్యక్తిగతం అవుతుందని అంటున్నారు. దాంతో పవన్ వచ్చాక కూటమి నేతల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరుగుతాయని అంటున్నారు.
త్వరలో చర్చిస్తాం :
మరో వైపు చూస్తే బీజేపీ కూడా సీట్ల సర్దుబాటు విషయంలో ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఆ పార్టీ కూడా కూటమితో పొత్తులో ఉంటే గణనీయంగా సీట్లు గెలుచుకోవచ్చు అని భావిస్తోంది. ఈసారి ఆ పార్టీ నుంచి కూడా అనేక మంది పోటీకి తయారుగా ఉన్నారు. విశాఖ, రాజమండ్రి మేయర్ సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతోంది. అలాగే జెడ్పీల విషయానికి వస్తే అల్లూరి జిల్లాతో పాటు గోదావరి జిల్లాలు కోస్తాలో కొన్ని కోరుకుంటోంది అని అంటున్నారు. ఈ ప్రచారం ఇలా ఉండగానే స్థానిక ఎన్నికల విషయంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ స్పందించారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలపై క్లారిటీ రాలేదు అని ఆయన చెప్పడం విశేషం. రానున్న మూడు రోజులలో కూటమి పార్టీలు కూర్చుని చర్చిస్తామని చెప్పారు. అలాగే స్థానిక ఎన్నికల పోటీ విధివిధానాలపై చర్చ ఉంటుందని అన్నారు. ఈసారి బీజేపీ నుంచి కూడా వంద శాతం స్ట్రైక్ రేట్ కోసం ప్రయత్నిస్తామని మాధవ్ చెప్పడం విశేషం.
చవితి తరువాతనే :
స్థానిక ఎన్నికలపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్పందన చూస్తే మరో మూడు రోజులలో కూటమి పార్టీలు కలిసి కూర్చుని చర్చిస్తాయని క్లారిటీ అయితే వచ్చింది. వినాయకచవితి పండుగ దగ్గరలో ఉంది. అది అయిన తరువాత ఈ నెల 16న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాధవ్ సీట్ల సర్దుబాటు గురించి కీలక చర్చలు జరుపుతారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
