స్థానిక ఎన్నికలకు కూటమి సిద్ధం...వైసీపీ చేయాలి యుద్ధం !
ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు మొదలెట్టింది. గత ఏడాది నుంచే ఈ దిశగా చర్యలు ప్రారంభించారు.
By: Satya P | 9 Feb 2026 9:26 AM ISTస్థానిక సంస్థలకు ఈ ఏడాదిలో పదవీ కాలం పూర్తి అయిపోతుంది. కార్పోరేషన్లు మునిసిపాలిటీలలో పాలక వర్గాలకు గడువు ఈ మార్చితో ముగుస్తూండగా పంచాయతీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు సైతం త్వరలోనే గడువు ముగియనుంది. దాంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చురుకుగా పరిశీలిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళకు దగ్గర పడుతున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికలను ఇపుడే నిర్వహించడం మేలు అన్న భావన ఉంది అని అంటున్నారు.
కసరత్తు మొదలెట్టిన ఈసీ :
ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు మొదలెట్టింది. గత ఏడాది నుంచే ఈ దిశగా చర్యలు ప్రారంభించారు. అయితే జనాభా గణన ఒకటి ఉందని మధ్యలో ప్రచారం సాగింది. దాంతో ఎన్నికలు ఈ ఏడాది ఉండవేమో అని అనుకున్నారు. అయితే 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 దాకా జనాభా గణన ఉంటుందని అధికారులు ప్రకటించారు. దాంతో స్థానిక ఎన్నికలు ముందుకు వచ్చాయి. యధావిధిగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిపించాలని చూస్తున్నారు. మార్చి 9 లోగా కార్పోరేషన్లు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు చెందిన ఓటర్ల తుది జాబితాను ఫోటోలతో సహా రిలీజ్ చేయాలని ఎన్నికల సంఘం జిల్లాల అధికారులను ఆదేశించింది. ఆ మీదట ఓటర్ల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల తేదీని ప్రకటిస్తారు అని అంటున్నారు.
మూడు పార్టీల కూటమి :
ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నపుడు నిర్వహించలేదు, అనేక కారణాల వల్ల జాప్యం జరిగింది. చివరికి ఎన్నికల ముందు ఎందుకు అనుకుని వాయిదా వేశారు. అయితే ఈసారి అధికారంలో కూటమి మాత్రమే లేదు, జనసేన బీజేపీ కూడా ఉన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలని వారంతా కోరుతున్నారు. ఎన్నికలు జరిగితే ద్వితీయ తృతీయ శ్రేణి నేతలకు స్థానికంగా పదవులు దక్కుతాయని అంటున్నారు. దాంతో చాలా కాలంగా ఈ ఎన్నికల కోసం అంతా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు పెట్టి తీరాలన్న భావన కూటమి ప్రభుత్వంలో వ్యక్తం అవుతోంది.
ముందుగా అక్కడే :
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా కార్పోరేషన్లు మునిసిపాలిటీలు నగర పంచాయతీలకు జరుగుతాయని అంటున్నారు. దాని వెనక కూటమి పెద్దల వ్యూహం ఉందని అంటున్నారు నిజానికి చూస్తే పట్టణాలలో మొదటి నుంచి వైసీపీకి కొంత బలం తక్కువగా ఉంటుంది. పైగా కూటమి పార్టీలకు అనుకూలంగా ఓటర్లు ఉంటారు అని అంటారు. దాంతో పట్టణాల నుంచే పల్లెల వైపుగా స్థానిక ఎన్నికల యుద్ధాన్ని తీసుకుని వెళ్లాలని కూటమి పెద్దలు ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. కూటమి పటిష్టంగా ఉంది. పైగా విద్యావంతులు తటస్థులు ఇలా విభిన్న వర్గాల సమాహారం అయిన పట్టణాలలో కూటమి స్థానిక ఎన్నికలు పెడితే వైసీపీకి అది అసలైన రాజకీయ యుద్ధం గానే ఉంటుంది అని అంటున్నారు.
తట్టుకుని నిలవాలి :
కూటమి పార్టీలు ఉమ్మడిగా వస్తే వారిని తట్టుకుని నిలవాల్సిన అవసరం వైసీపీకి ఉంది. వైసీపీ ధీటైన వ్యూహాలను రచించకపోయినా బలమైన అభ్యర్థులను బరిలోకి నిలబెట్ట లేకపోయినా ఇబ్బంది అన్నది ఎదురవుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే సహజంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే అనుకూలంగా ప్రజలు స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తారు. అయినా సరే తమ ఉనికి కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత విపక్షం పైన ఉంటుంది. ఎంతో కొంత తమ సత్తా చాటి తమ బలం పెంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణాలో అదే జరుగుతోంది. బీఆర్ఎస్ అక్కడ గట్టిగా నిలబడుతోంది. ఏపీలో అలా వైసీపీ నిలిచి కూటమితో స్థానిక ఎన్నికల సమరం సాగించాల్సి ఉందని అంటున్నారు.
