ఎంపీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు: ఒకరిపై ఒకరు పోటీ పడి గెలిచిన రక్తసంబంధీకులు!
స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తండ్రి వైసీపీ నుంచి, కుమార్తె టీడీపీ నుంచి ఎంపీటీసీలుగా గెలిచారు. విజయనగరం జిల్లాలో తల్లీకూతుళ్లు ప్రత్యర్థులుగా పోటీ చేయగా తల్లి విజయం సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో తండ్రీకూతుళ్లు ఒకే పార్టీ నుంచి గెలిచారు. ఆచంటలో తోడికోడళ్ల పోరులో మంగదేవి 18 ఓట్లతో విజయం సాధించారు.
By: Tupaki Desk | 8 Nov 2026 8:31 AM ISTస్థానిక ఎన్నికల ఫలితాలు కొలిక్కి వస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 659 స్థానాలకు 77 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 582 చోట్ల ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 7 వేలకు పైగా ఎంపీటీసీ స్థానాల్లో కూటమి విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు గెలవడం ఒక ఎత్తు అయితే కొందరు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేయడం, మరికొందరు ఒకరిపై ఒకరు పోటీకి దిగి నువ్వానేనా అన్నట్లు తలపడటం ఈ ఎన్నికల్లో హైలెట్ గా నిలిచింది.
కూతురు టీడీపీ, తండ్రి వైసీపీ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంపీటీసీలుగా ఎన్నికైన తండ్రి తనయలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొత్తపేట మండలంలోని కొత్తపేట రెండో ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి పొనుగుపాటి చాందిన గెలుపొందారు. ఇదే మండలంలోని పలివెల రెండో ఎంపీటీసీ సభ్యుడిగా పొనుగుపాటి సత్యనారాయణ విజయం సాధించారు. ఈ ఇద్దరు వేర్వేరు పార్టీల తరఫున గెలిచినప్పటికీ స్వయాన తండ్రీ కూతురు కావడం స్థానికంగా ఆసక్తి రేపింది. ఈ మండలంలో మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో కేవలం ఒకేఒక స్థానం నుంచి వైసీపీ గెలిచింది. అదీ సత్యానారాయణ కావడం విశేషంగా చెబుతున్నారు.
తల్లి పైచేయి.. కూతరు పరాజయం
ఎక్కడైనా చుట్టరికం కానీ రాజకీయాల్లో కాదని నిరూపించారు విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కోటశిర్లాం గ్రామానికి చెందిన బప్పడాల వెంకటలక్ష్మి, బప్పడాల జయలక్ష్మి. ఎంపీటీసీ ఎన్నికల్లో బప్పడాల వెంకటలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా బప్పడాల జయలక్ష్మి పోటీ చేశారు. ఇందులో వెంకటలక్ష్మి విజయం సాధించారు. అయితే ఈ ఇద్దరు స్వయాన తల్లీకూతురు కావడం గమనార్హం. రాజకీయ ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు పోటీ చేయగా, కూతురిపై తల్లి విజయం సాధించడం స్థానికంగా చర్చకు దారితీసింది.
ఒకే పార్టీ నుంచి తండ్రీ కూతరు
స్థానిక ఎన్నికలు సందర్భంగా చాలా చోట్ల ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ చేశారు. ఇందులో పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలానికి చెందిన జి.యుగంధర్, ఆయన కుమార్తె కావ్య టీడీపీ తరపున గెలుపొందారు. ఈ ఇద్దరూ ఒకేసారి ఎంపీటీసీలుగా ఎన్నికవడం స్థానికంగా హాట్ టాపిక్ అవుతోంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో తోడికోడళ్ల మధ్య పోరు జరిగింది. ఇందులో కూటమి బలపరిచిన అభ్యర్థి బోడపాటి మంగదేవి తన ప్రత్యర్థి అయిన తోడికోడలిపై 18 ఓట్ల తేడాతో గెలుపొందారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో భార్యభర్తలు యాళ్ల జగదీష్, మంగాదేవి ప్రత్తిపాడు పట్టణంలోని రెండు, మూడో నంబరు ఎంపీటీసీలుగా గెలిచి రికార్డు సృష్టించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో బంధువులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు.
