మంత్రులు, ఎమ్మెల్యేలకు...బాబు మార్క్ ఆదేశం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పీక్స్ కి చేరుకుంది. మొదటి విడత ఎన్నికలకు సరిగ్గా వారమే సమయం ఉంది.
By: Satya P | 20 Oct 2026 10:45 PM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పీక్స్ కి చేరుకుంది. మొదటి విడత ఎన్నికలకు సరిగ్గా వారమే సమయం ఉంది. దాంతో పాటు పది రోజుల వ్యవధిలో తొలి ఫలితాలు వస్తాయి. ఏపీలో జనం మూడ్ ఏంటో కూడా ఈ ఫలితాలు నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది కీలకమైన టెలీ కాన్ఫరెన్స్ గా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా బాబు చేసిన దిశా నిర్దేశం అయితే పార్టీని మొత్తం లోకల్ బాడీ ఎన్నికల కోసం సమాయత్త పరచినట్లు అయింది.
కార్యకర్తలుగా మారండి :
స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత ముఖ్యమో చంద్రబాబు వివరించిన తీరు చూస్తే అర్ధం అవుతోంది. ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలుగా మారి పని చేయాలని కోరారు. అంతే కాదు ఇంటింటి ప్రచారంతో పాటు బూత్ స్థాయి వరకూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ విషయంలో గ్రౌండ్ లెవెల్ లో ఫోర్ ఫ్రంట్ లో మంత్రులు ఎమ్మెల్యేలు నిలబడాలని బాబు గట్టిగా స్పష్టం చేశారు. దాంతో టీడీపీ అధినాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఎంత ప్రతిష్టగా తీసుకుంది అన్నది చూడాల్సి ఉంది.
రెబెల్స్ ని వద్దు :
ఇక చాలా చోట్ల కూటమి పొత్తులకు వ్యతిరేకంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం అభ్యర్థులను నిలబెట్టవద్దని చంద్రబాబు స్ట్రాంగ్ మేసేజ్ ని పంపించారు. అలా కనుక చేస్తే ఊరుకోమని కూడా హెచ్చరించారు. కూటమి పొత్తులను అందరూ గౌరవించాలని ఆయన కోరారు. ఒక వేళ సమీకరణాలు, పొత్తుల్లో భాగంగా ఎవరికైనా సీట్లు దక్కకపోతే నామినేటెడ్ పదవులలో వారికి స్థానం కల్పిస్తామని బాబు భరోసా ఇచ్చారు.
వైసీపీ మీద విమర్శలు :
ఏపీలో విలువలు లేని రాజకీయాలు, రౌడీయిజం, అధికార దుర్వినియోగంతో చేసే రాజకీయం ఎప్పుడూ నిలబడదని పరోక్షంగా వైసీపీ మీద బాబు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎండగట్టారు. టీడీపీ కూటమి ప్రజలు మంచి చేసి జనంలోకి వెళ్తోంది అని ఆయన అన్నారు. ఆ విషయాన్ని పార్టీ నేతలు అంతా జనాలకు వివరించాలని ఆయన కోరుకున్నారు. ఇక కూటమిలో ఐక్యత ముఖ్యమని పొత్తులు అన్నవి కట్టుదిట్టంగా అమలు కావాలని కూడా బాబు చెప్పుకొచ్చారు. మొత్తం మీద మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంతా జనంలోకి వెళ్లాలని ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు అయితే సందేశం ఇచ్చారు. అదే విధంగా పార్టీకి కూటమిని మంచి ఫలితాలు రావాలని ఆకాంక్షించారు.
