ఏపీలో 28 జెడ్పీ చైర్మన్లు...కూటమి వ్యూహం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ ఏడాది మార్చి 17తో కార్పోరేషన్ల పదవీ కాలం పూర్తి అవుతుంది.
By: Satya P | 6 March 2026 5:00 AM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ ఏడాది మార్చి 17తో కార్పోరేషన్ల పదవీ కాలం పూర్తి అవుతుంది. అలాగే మునిసిపాలిటీల పదవీ కాలం కూడా సమాప్తం అవుతుంది. పంచాయతీ పదవీ కాలం కూడా పరిసమాప్తం అవుతోంది. అయితే జిల్లా పరిషత్తులు మండల పరిషత్తుల పదవీ కాలం మరి కొద్ది నెలలు ఉందని అంటున్నారు. దీంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను దశల వారీగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం తెర వెనక భారీ కసరత్తుని కూడా చేస్తోంది.
ముందుంగా జెడ్పీటీసీలకే :
ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుగా జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. ఇవి గ్రామీణ ప్రాంతంలో ఉన్నా పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. పంచాయతీలకు గుర్తులు ఉండవు, దాంతో అక్కడ రాజకీయంగా రెండుగా గ్రామాలు చీలిపోతే ఆ ప్రభావం జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల మీద పడుతుంది అని భావిస్తున్నారు. దాంతో జిల్లా మండల పరిషత్తుల ఎన్నికల్లో స్థానిక సమరానికి శ్రీకారం చుడతారు అని అంటున్నారు.
రెట్టింపు జెడ్పీ చైర్మన్లు :
ఇదిలా ఉంటే 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జిల్లాలు ఉమండిగా ఉన్నాయి. దాంతో జెడ్పీటీసీ చైర్మన్ పదవులు 13 జిల్లాలకే పరిమితం అయ్యాయి. 2022లో కొత్త జిల్లాలు ఏర్పాటు అయి 26గా మారాయి. ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ప్రకటించింది. దాంతో ఏపీలో 28 జిల్లాలు ఉన్నాయి. జెడ్పీ ఎన్నికలు జరిగితే కొత్త జిల్లాల ప్రకారమే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో స్పష్టం చేసిన నేపధ్యంలో 28 జిల్లా పరిషత్తులు వస్తాయి. అలా చైర్మన్ పదవులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి అని అంటున్నారు.
కసరత్తు జరుగుతోంది :
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని ఆయన చెప్పారు. పంచాయతీల పునర్విభజన పైన న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేసే చర్యలను తీసుకున్నామని అన్నారు.
ఆశావహులకు చాన్స్ :
కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. దాంతో జిల్లా పారిషత్తు చైర్మన్లు రెట్టింపు అయితే అన్ని పార్టీలకు అవకాశం లభిస్తుంది అని అంటున్నారు. మెజారిటీ జెడ్పీ చైర్మన్లు టీడీపీ వారికి దక్కినా దామాషా పద్ధతిలో జనసేన బీజేపీలకు కూడా అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి జిల్లా పరిషత్తులు 28 గా విభజించడం వల్ల పాలన కూడా మరింతగా వికేంద్రీకరణ జరిగి మేలు జరుగుతుందని అంటున్నారు.
