Begin typing your search above and press return to search.

లిక్కర్ ట్రాన్స్ పోర్టు స్కాం కేసు.. ఉత్తరాంధ్ర, సీమ నేతలకు తప్పిన ముప్పు?

వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు బయట పడినట్లేనా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.

By:  Tupaki Desk   |   25 Aug 2026 10:52 PM IST
లిక్కర్ ట్రాన్స్ పోర్టు స్కాం కేసు.. ఉత్తరాంధ్ర, సీమ నేతలకు తప్పిన ముప్పు?
X

వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు బయట పడినట్లేనా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. రూ.400 కోట్ల మేర అక్రమాలు, మనీలాండరింగ్ ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో నిందితులుగా ఇప్పటివరకు నలుగురిని గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు వైసీపీ నేతలు ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొన్న ఐటీశాఖ మాజీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఈడీ కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ కూడా అరెస్టు అయ్యారు.

లిక్కర్ కేసులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డిని ఈడీ కేసులోనూ ప్రధాన నిందితుడిగా చూపడమే కాకుండా చాలా కాలం క్రితమే ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత కారుమూరి సునీల్ ను రెండు రోజుల క్రితం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్టు చేసింది. అయితే ఈ కేసు ఇక్కడితో ఆగుతుందా? మరికొందరికి చుట్టుకుంటుందా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిందని అభియోగాలు మోపింది. ఈ కేసు దర్యాప్తు సమయంలోనే మద్యం రవాణాలోనూ అక్రమాలు జరిగాయని గుర్తించి మరో కేసు నమోదు చేసింది.

ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఆధారాలు లభించాయని చెబుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ ను అరెస్టు చేసింది. అయితే ఈ రవాణా కుంభకోణంలో మరికొందరు వైసీపీ నేతల పాత్ర ఉందని గతంలో ప్రభుత్వ అనుకూల వర్గాలు ప్రచారం చేశాయి. రవాణా కాంట్రాక్టు పొందిన సిగ్మా సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకున్నారని, ప్రాంతాల వారీగా మద్యం రవాణా చేసి భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు వినిపించాయి. పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వెలువడ్డాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఒక కీలక నేత సమీప బంధువు, ప్రస్తుతం జడ్పీ చైర్మనుగా ఉన్న నేత పేరుతోపాటు గుంటూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, రాయలసీమకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మరో నేత పేర్లు విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు వీరి వరకు వెళ్లలేదని అంటున్నారు.

మద్యం రవాణా కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి కారుమూరి, ఆయన కుమారుడిని పలుమార్లు విచారించిన ఈడీ చివరికి అరెస్టు చేసింది. ఈ విషయంలో అరెస్టు నుంచి తప్పించుకోడానికి మాజీ మంత్రి కారుమూరి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇదే సమయంలో దర్యాప్తులో మిగిలిన నేతల పేర్లు బయటపడకపోవడంతో వారంతా స్కాం నుంచి బయటపడినట్లే పరిశీలకులు భావిస్తున్నారు. అయితే మద్యం రవాణా కుంభకోణంలో మరికొందరు వైసీపీ నేతల పాత్ర ఉన్నప్పటికి, వారికి మనీలాండరింగ్ తో సంబంధం లేకపోవడం వల్లే ఈడీ వదిలేసిందని ప్రభుత్వ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. మద్యం రవాణా కుంభకోణం వేరని, డబ్బును అక్రమంగా విదేశాలకు మళ్లించడం వేరని అంటున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును మనీలాండరింగ్ ఆరోపణలపైనే ఈడీ అరెస్టు చేసిందని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి తాజా పరిణామాలతో మద్యం స్కాం కేసు మళ్లీ హాట్ టాపిక్ అవుతోందని చెబుతున్నారు.