ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఏపీ లిక్కర్ స్కాంలో రెండింటికి ఏమైనా లింకు ఉందా?
లిక్కర్ స్కాం అంటే ముందు గుర్తుకు వచ్చేది ఢిల్లీనే.. ఏపీ లిక్కర్ స్కాంతో పోల్చుకుంటే నగదు రూపంలో వచ్చిన ఆరోపణలు చాలా తక్కువైనా.. ఢిల్లీ లిక్కర్ స్కాం నాలుగేళ్లకు పైగా జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
By: Tupaki Desk | 24 April 2025 9:57 AM ISTలిక్కర్ స్కాం అంటే ముందు గుర్తుకు వచ్చేది ఢిల్లీనే.. ఏపీ లిక్కర్ స్కాంతో పోల్చుకుంటే నగదు రూపంలో వచ్చిన ఆరోపణలు చాలా తక్కువైనా.. ఢిల్లీ లిక్కర్ స్కాం నాలుగేళ్లకు పైగా జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అటు అప్పటి ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతోపాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నేతల కుటుంబ సభ్యుల పాత్ర వెలుగు చూడటంతో ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలుగు ప్రజలు చర్చించుకున్నారు. అయితే ఢిల్లీ స్కాంకు వందల రెట్లు మించి ఏపీలో స్కాం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు స్కాంలకు ఏమైనా సారూప్యత ఉందా? అనేది చర్చకు దారితీస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం, ఏపీ లిక్కర్ స్కాంలో కొన్ని సారూప్యతలు, మరికొన్ని భిన్న ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఢిల్లీలో అప్పటివరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తివేసి.. ప్రైవేటుకు అప్పగించడం, మద్యం ధరలపై నియంత్రణ ఎత్తివేయడం వంటివి అక్రమార్జనకు తెరలేపాయని దర్యాప్తు వర్గాలు ఆరోపించాయి. కానీ, ఏపీ లిక్కర్ స్కాంలో ప్రైవేటు షాపులను ఎత్తివేసి ప్రభుత్వమే మద్యం విక్రయించింది. దీంతో స్కాంలో విక్రయాలే ప్రధాన అంశం అయినా, పరస్పర విభిన్న నిర్ణయాలు అంటున్నారు. అయినా రెండు స్కాముల్లో అక్రమార్జనకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేవలం రూ.100 కోట్ల డీల్ పై ఆరోపణలు వచ్చాయి. సౌత్ గ్రూపు నుంచి అప్పటి ఆప్ ప్రభుత్వ పెద్దలకు రూ.100 కోట్లు ముట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ డబ్బు ఎవరిచ్చారు? ఎవరికిచ్చారు? అనేది తేల్చకపోయినా, దర్యప్తు మొత్తం రూ.100 కోట్లు చుట్టూనే తిరిగింది. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్రాచంద్రారెడ్డి అరెస్టు అప్పట్లో సంచలనం రేపింది.
ఇక ఏపీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ స్కాం నిందితులకు సంబంధం లేకపోయినా, అరబిందో శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారం నిమిత్తం రూ.వంద కోట్లు అప్పుగా ఇచ్చారని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఇవ్వడం సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి ఈ విషయం బహిర్గతం చేసేవరకు ఈ అంశం ఎవరికీ తెలియదంటున్నారు. విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగా అరబిందో డబ్బు ఇవ్వడంపై సిట్ దృష్టి సారించే అవకాశం ఉందంటున్నారు.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంను కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారించాయి. రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశాయి. ఈ స్కాంలో అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోదియా వంటివారిని అరెస్టు చేశారు. కానీ, ఏపీ స్కాంలో అధికార వర్గాలను ఎవరినీ టచ్ చేస్తున్నట్లు కనిపించడం లేదంటున్నారు. ప్రస్తుతానికి అప్పటి ప్రభుత్వ పెద్దలపై ఎవరూ ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి పార్లమెంటు సభ్యులే ఏపీ లిక్కర్ స్కాం నడిపారని సిట్ ఆరోపిస్తోంది.
ఇక రెండు కుంభకోణాలకు ఒక సారూప్యత ఉందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంను కొందరు ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై ఆప్ నేతల ఇళ్లలో కూర్చొని నడిపించారని, ప్రైవేటు సమావేశాల్లో ప్రభుత్వ పాలసీని తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఏపీలోనూ ఇదే రీతిలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లో కూర్చోని పాలసీపై చర్చించారని అంటున్నారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి స్వయంగా బయట పెట్టడం ఢిల్లీ స్కాంను గుర్తుకు తెచ్చిందని అంటున్నారు. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కాంలో తదుపరి దర్యాప్తు ఎంతవరకు వెళుతుందనేది ఆసక్తి రేపుతోంది.
