విజయసాయిరెడ్డి Vs కేసిరెడ్డి.. ఎత్తుకుపైఎత్తుతో ఇరుక్కున్నారా!
ఏపీ లిక్కర్ స్కాంలో ఓ కీలక పరిణామం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా వైసీపీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్కాంలో ఇరుక్కోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 23 April 2025 3:58 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో ఓ కీలక పరిణామం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా వైసీపీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్కాంలో ఇరుక్కోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఏ5గా సాయిరెడ్డిపై సిట్ అభియోగాలు నమోదు చేసింది. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి ఆరోపించినట్లే వైసీపీ నేత, ఐటీశాఖ మాజీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని ఏ1గా పేర్కొంటూ అరెస్టు చేయడమూ సంచలనం రేపుతోంది. లిక్కర్ కేసులో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న ఈ ఇద్దరూ స్కాంలో ఇరుక్కోవడమే హైలెట్ గా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి స్కాంలో అప్రూవర్ విజయసాయి మారతారని అనుకున్నారు. ఆయనను నిందితుడిగా చూపించే అవకాశం లేదని భావించారు. కానీ, నిందితుల జాబితాలో విజయసాయిరెడ్డి ఐదో స్థానంలో చూపడమే హాట్ టాపిక్ అవుతోంది.
లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కేసిరెడ్డి అంటూ గత నెల 12న విజయసాయిరెడ్డి వెల్లడించారు. మీడియా సమావేశంలోనే విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో సాయిరెడ్డిని సాక్షిగా పరిగణిస్తారని టాక్ వినిపించింది. లిక్కర్ స్కాంపై తనకు అంతా తెలుసని, పోలీసులు అడిగితే మరింత సమాచారం ఇస్తానని విజయసాయిరెడ్డి అప్పట్లో చెప్పారు. ఇక 18వ తేదీన సాయిరెడ్డిని విచారించిన పోలీసులు పలు కీలక విషయాలపై వాంగ్మూలం నమోదుచేశారు. ఈ క్రమంలోనే రాజ్ కేసిరెడ్డిని ప్రధాన ముద్దాయిగా చూపారు. లిక్కర్ కేసులో సాయిరెడ్డి ప్రకటన తర్వాత రాజ్ కేసిరెడ్డిపై పూర్తిగా స్పష్టత వచ్చినట్లైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. అంటే విజయసాయి వల్లే రాజ్ కసిరెడ్డి ఇరుక్కున్నారని టాక్ నడుస్తోంది.
మరోవైపు తనను స్కాంలో ప్రధాన ముద్దాయిగా నిలిపిన విజయసాయిరెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన రాజ్ కేసిరెడ్డి.. మంగళవారం నాటి విచారణలో పూసగుచ్చినట్లు వివరించాడని అంటున్నారు. లిక్కర్ స్కాంలో సాయిరెడ్డికి పాత్ర ఉందని ఆయన చెప్పడంతో నిందితుల జాబితాలో సాయిరెడ్డి ఏ5 అయ్యారని అంటున్నారు. లిక్కర్ స్కాంలో తనకు అంతా తెలుసునని, దొరికిన దొంగలు దొరకని దొంగలకు ప్రస్తుతం సగం మాత్రమే బట్టలు విప్పారని, తాను మొత్తం బట్టలు విప్పిస్తానని సాయిరెడ్డి హెచ్చరించడం వైసీపీకి టెన్షన్ పుట్టిస్తోంది. దీంతో విజయసాయిరెడ్డిని అలా వదిలేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అప్రమత్తమైన అధిష్టానం స్కాంలో విజయసాయిరెడ్డి పాత్రపై ఆధారాలు సమర్పించాల్సిందిగా కేసిరెడ్డికి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎరక్కపోయి ఇరుక్కున్నట్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు.
