లిక్కర్ స్కాం.. వెంకటేశ్ నాయుడు నుంచి వైసీపీ తప్పించుకోలేదా?
లిక్కర్ స్కాంలో వెంకటేశ్ నాయుడు పాత్రపై సిట్ స్పష్టమైన ఆధారాలు సంపాదించిందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 7 Aug 2025 6:00 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో ఏ34 చెరుకూరి వెంకటేశ్ నాయుడు లింకులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. వెంకటేశ్ నాయుడు ఫోన్ నుంచి డిలీట్ చేసిన వీడియోలు బయటకు వచ్చాక అతడితో తమకు సంబంధం లేదని విపక్షం వైసీపీ చెబుతోంది. అయితే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు అంటూ గతంలో వైసీపీ మీడియా చెప్పిన విషయాన్ని టీడీపీ గుర్తు చేస్తోంది. దీంతో వెంకటేశ్ నాయుడు వ్యవహారం వైసీపీకి మరింత తలనొప్పిగా మారిందని అంటున్నారు.
టీడీపీ బలమైన కౌంటర్
లిక్కర్ స్కాంలో వెంకటేశ్ నాయుడు పాత్రపై సిట్ స్పష్టమైన ఆధారాలు సంపాదించిందని చెబుతున్నారు. దీంతో అతడితో తమకు సంబంధం లేదని వైసీపీ వాదన తెరపైకి తెచ్చింది. లిక్కర్ స్కాంలో నిందితుడు అయిన వెంకటేశ్ నాయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రమంత్రి నారా లోకేశ్ తోపాటు పలువురు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని కొన్ని ఫొటోలను వైసీపీ బయటపెట్టింది. అయితే దీనికి టీడీపీ నుంచి బలమైన కౌంటర్ రావడంతో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరుగుతోంది.
కీలక ప్రశ్నలు
ఏ34 వెంకటేశ్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, వీడియోలో కనిపించిన డబ్బు కట్టలు ఆయనవేనని చెప్పిన వైసీపీ.. రూ.2 వేల నోట్లను సాకుగా చూపి ఆ వీడియో ఎన్నికల నాటిది కాదని వాదించింది. అయితే దీనికి కౌంటరుగా టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తడం చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్ నాయుడు అన్న విషయాన్ని ఎలా కాదనగలరని ప్రశ్నించిన ఆయన చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడు ఒకేసారి అరెస్టు అయిన విషయాన్ని కాదని అనగలరా? అంటూ ప్రశ్నించారు.
వైసీపీతో లింకులపై ఆరోపణలు
అంతేకాకుండా వీడియోలు, ఫొటోలు అన్నీ వెంకటేశ్ నాయుడి ఫోన్ నుంచి వెలికి తీసినవే అని చెబుతున్న టీడీపీ, చెవిరెడ్డితో కలిసి విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో వెంకటేశ్ నాయుడిని అరెస్టుచేసిన విషయం గుర్తు చేస్తోంది. ఈ ఒక్క అంశమే లిక్కర్ స్కాంలో వైసీపీ నేతల పాత్రను బయటపెడుతోందని టీడీపీ చెబుతోంది. అంతేకాకుండా ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డికి తమకు సంబంధం లేదని వైసీపీ చెబుతున్న విషయాన్ని టీడీపీ ఖండిస్తోంది. వైఎస్ సుజాతారెడ్డి అల్లుడైన రాజ్ కేసిరెడ్డి మీ కుటుంబ సభ్యుడు కాదా? అంటూ వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిని నిలదీస్తోంది టీడీపీ. వైఎస్ సుజాతరెడ్డి అల్లుడికి వైఎస్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పగలరా? అంటూ ప్రశ్నిస్తోంది టీడీపీ. ఇక మరో నిందితుడైన ఆదాన్ డిస్టలరీస్ డైరెక్టర్ ముప్పిడి అవినాశ్ రెడ్డి కేసిరెడ్డికి సమీప బంధువు అన్న విషయాన్ని గుర్తుచేస్తోంది. లిక్కర్ స్కాంలో వీరి పాత్ర స్పష్టంగా తెలుస్తుండగా, తమకు సంబంధం లేదని వైసీపీ ఎలా చెబుతుందని ఆనం వెంకటరమణారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.
