Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కాం : మాజీ సీఎం జగన్ కంపెనీలో సిట్ సోదాలు

భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఈ కేసులో ఏ33గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2025 12:02 PM IST
లిక్కర్ స్కాం : మాజీ సీఎం జగన్ కంపెనీలో సిట్ సోదాలు
X

ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్టు చేసిన సిట్.. సూత్రధారులను గుర్తించే పనిని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే కీలక నిందితుడిగా చెబుతున్న బాలాజీ గోవిందప్ప కార్యాలయంలో శనివారం సోదాలు ప్రారంభించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న భారతీ సిమెంట్స్ లో బాలాజీ గోవిందప్ప పనిచేస్తున్నారు. ఈ కంపెనీ మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతీరెడ్డిది కావడం గమనార్హం. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ లోని మూడు చోట్ల సిట్ సోదాలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ లోని భారతీ సిమెంట్స్ లో గోవిందప్ప చాంబర్ లో పలు పత్రాలను సిట్ పోలీసులు పరిశీలిస్తున్నారు.

మొత్తం మూడు చోట్ల సోదాలు

మద్యం కుంభకోణంలో మరిన్ని ఆధారాల సేకరణ కోసమే సిట్ హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. సహ నిందితులు, డిస్టిలరీల యజమానులతో భేటీలు జరిగిన ప్రాంతాల సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. గూగుల్ టేకౌట్ ద్వారా బాలాజీ గోవిందప్ప కార్యాలయంలో జరిగిన భేటీలు, అందులో పాల్గొన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం మూడు చోట్ల తనిఖీలు జరుగుతుండగా, మొదటిది మాజీ సీఎం జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ కార్యాలయం కాగా, రెండోది ఏ1 రాజ్ కసిరెడ్డి సాఫ్ట్ వేర్ కంపెనీ, మూడోది ఏ8 చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్. సోదాలు నిర్వహిస్తున్న సిట్ పోలీసులతో సాంకేతిక నిపుణులు ఉన్నారు.

భారతీ సిమెంట్స్ లో భేటీలు?

భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఈ కేసులో ఏ33గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈయన ఆధ్వర్యంలో భారతీ సిమెంట్స్ కార్యాలయంలోనే పలువురు డిస్టలరీ యజమానులతో సమావేశమైన ప్రదేశాన్ని సిట్ ఇదివరకే గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న భారతీ సిమెంట్స్ కార్యాలయంలో బాలాజీ గోవిందప్ప చాంబర్ ను సిట్ అధికారులు పరిశీలించారు. అయితే ముందుగా సెర్చ్ వారెంట్ చూపినదే కార్యాలయంలోకి అనుమతించమని భారతీ సిమెంట్స్ ప్రతినిధులు సిట్ సిబ్బందిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైడ్రామా కొనసాగింది. అనంతరం సిట్ పోలీసులు గోవిందప్ప చాంబర్ కు వెళ్లి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

త్వరలోనే రెండో చార్జిషీటు

లిక్కర్ కేసులో ఏ 33 బాలాజీ గోవిందప్ప పాత్రపై సిట్ త్వరలో చార్జిషీటు దాఖలు చేయనుందని అంటున్నారు. ఇప్పటికే సిట్ కోర్టుకు సమర్పించిన తొలి చార్జిషీటులో గోవిందప్ప పాత్రపై ప్రస్తావన తేలేదు. ఆయనతోపాటు మరికొందరు నిందితుల పాత్రను వివరిస్తూ రెండో చార్జిషీటు దాఖలు చేస్తామని సిట్ ఇప్పటికే కోర్టుకు నివేదించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసిన సమయంలో రెండో చార్జిషీటు వేసేందుకు మూడు వారాల గడువు కోరింది. అయితే ఇప్పటికే సగం రోజులు పూర్తవడంతో సిట్ దర్యాప్తు పుంజుకుందని అంటున్నారు.