మిథున్ రెడ్డి Vs సాయిరెడ్డి.. లిక్కర్ కేసులో ఇద్దరికీ లింకు ఉందా?
ఏపీ మద్యం స్కాంలో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని ఓ సారి విచారించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 21 April 2025 4:02 PM ISTఏపీ మద్యం స్కాంలో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని ఓ సారి విచారించిన విషయం తెలిసిందే. విచారణలో వారు చెప్పిన విషయాలను క్రోడీకరిస్తున్న సిట్ అధికారులు వారిని మరోసారి విచారణకు పిలవొచ్చని అంటున్నారు. అయితే ఈ కేసులో ఎవరు సాక్షి, ఎవరు నిందితులు అన్నదానిపై పోలీసులు పెదవి విప్పడం లేదు. విచారణకు హాజరైన వారితోపాటు విచారణకు రాకుండా తప్పించుకుంటున్న వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని ప్రస్తుతానికి సాక్షిగానే పరిగణిస్తున్నారు. అయితే తనను సాక్షిగా పిలిచి అరెస్టు చేస్తారని రాజ్ కసిరెడ్డి భయపడుతుండటంతో సిట్ వ్యూహం ఆసక్తి రేపుతోంది.
లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. తనకే పాపం తెలియదని, విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్ కసిరెడ్డి చెబుతున్నారు. అయితే ఈ స్కాంకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించడమే చర్చనీయాంశమవుతోంది. ఈ ఇద్దరికీ స్కాంతో సంబంధం ఉందని సిట్ ఆరోపిస్తోంది. అయితే ఎంపీలుగా ఉన్న తమకు రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన బాధ్యత లేదని ఆ ఇద్దరూ వాదిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొంతవరకు సిట్ కు సహకరిస్తున్నా కీలక విషయాలపై ఆయన గోప్యత పాటిస్తున్నారని, ఎవరినో రక్షించాలని చూస్తున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాజకీయ కక్షతోనే తనను వేధిస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి చెబుతున్నారు.
అయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇద్దరికీ స్కాంతో సంబంధం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు, కమీషన్ చెల్లించిన వారికే ఆర్డర్లు ఇచ్చే విషయాన్ని సాయిరెడ్డి, మిథున్ రెడ్డి కలిసి పర్యవేక్షించేవారని టీడీపీ చెబుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అతిపెద్ద డిస్టలరీగా చెప్పే నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీసును మిథున్ రెడ్డి తన గుప్పెట్లో తెచ్చుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2019 అక్టోబరు నుంచి 2021 నవంబరు మధ్య 25 నెలల్లో ఏకంగా రూ.1800 కోట్ల విలువైన కోటి 16 లక్షల మద్యం కేసులను ఎస్పీవై ఆగ్రోలో తయారు చేసి సరఫరా చేశారని సిట్ ఆధారాలు సేకరించింది. గత ప్రభుత్వంలో ఈ ఒక్క కంపెనీకే రూ.6 వేల కోట్ల మేర లబ్ధి జరిగిందనేది సిట్ ఆరోపణ. ఈ కంపెనీకి మిథున్ రెడ్డికి నేరుగా సంబంధాలు ఉన్నాయని సిట్ వర్గాలు చెబుతుండటమే రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
మద్యం తయారు చేసేది.. ఏపీఎస్బీసీఎల్ తో కొనుగోలు చేయించేంది రెండు మిథున్ రెడ్డి ఆరోపణలు ఉన్నాయంటున్నారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సన్నిహితులతో ఓ బినామీ మద్యం సరఫరా కంపెనీ పెట్టించి భారీగా లబ్ధిపొందారని విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా రూ.100 కోట్లు అప్పు ఇప్పించానని విజయసాయిరెడ్డి చెప్పిన ఆదాన్ డిస్టలరీస్ 2019 డిసెంబరు 2న ఏర్పాటైంది. ఈ సంస్థకు సొంతంగా ఒక్క తయారీ యూనిట్ లేకపోయినా, సింహభాగం కొనుగోలు ఆర్డర్ లు జారీ చేయడం కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. దీంతో లిక్కర్ స్కాంలో మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఇద్దరికీ పాత్ర ఉందని ప్రభుత్వం, సిట్ ఆరోపిస్తోంది. దీనికి విజయసాయి, మిథున్ రెడ్డి ఏం సమాధానం చెప్పారనేది సిట్ అధికారులు బయటపెట్టాల్సివుంది.
