మద్యం స్కాంలో కీలక అరెస్టుకు రంగం సిద్ధం.. వైసీపీలో ఒకటే టెన్షన్
ఏపీ మద్యం స్కాంలో సిట్ దూకుడు పెంచింది. కొద్దిరోజులుగా దర్యాప్తుపై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో విచారణ తుది దశకు చేరిందని వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
By: Tupaki Desk | 22 Aug 2025 1:51 PM ISTఏపీ మద్యం స్కాంలో సిట్ దూకుడు పెంచింది. కొద్దిరోజులుగా దర్యాప్తుపై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో విచారణ తుది దశకు చేరిందని వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు 48 మందిని నిందితులుగా గుర్తించిన సిట్.. 12 మందిని అరెస్టు చేసింది. రెండు చార్జిషీటులు దాఖలు చేయగా, మాజీ ముఖ్యమంత్రి జగన్ కిక్ బ్యాక్ ద్వారా కమీషన్ డబ్బు అందుకున్నారని సిట్ ఆరోపించింది. అయితే ఈ కేసులో జగన్ ను ఎక్కడా కుట్రదారుగా పేర్కొనకపోవడంతో సిట్ వ్యూహం అంతుచిక్కడం లేదని అంటున్నారు. మరోవైపు నిందితుల జాబితాలో ఉన్నవారిలో కొందరిని అప్రూవర్లుగా మార్చుకోవాలని పావులు కదుపుతున్న సిట్.. ఇప్పటివరకు నిందితులుగా చెప్పని వారి అరెస్టుకు ప్రయత్నిస్తోందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్సైజ్ శాఖను పర్యవేక్షించిన వైసీపీ సీనియర్ నేత నారాయణస్వామిని సిట్ టార్గెట్ చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామిని విచారించేందుకు గత నెలలో సిట్ నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. దీంతో శుక్రవారం తిరుపతి జిల్లా పుత్తూరులో నివాసముంటున్న నారాయణస్వామి ఇంటికి సిట్ అధికారులు వచ్చారు. ఉదయం నుంచి ఆయనను పలు విషయాలపై ప్రశ్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆయనను ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మార్చిన పాలసీపై తనకే సమాచారం లేదని గతంలో నారాయణస్వామికి సిట్ కు చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నారాయణస్వామి వాంగ్మూలం కీలకంగా భావిస్తున్నారు. ఈ రోజు సిట్ విచారణ తర్వాత నారాయణస్వామిని అరెస్టు చేస్తారని అంటున్నారు.
లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు నారాయణస్వామి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని అంటున్నారు. కానీ, గతంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన ఆయనను కూడా నిందితుడుగా చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే నారాయణస్వామిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా చెబుతారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్నవారిలో నారాయణస్వామి ఒకరు. గత ఎన్నికల్లో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్న నారాయణస్వామి తన బదులుగా కుమార్తె కృపాలక్ష్మికి పోటీకి దింపారు. ఇక ఎన్నికల అనంతరం లిక్కర్ స్కాంపై విపతీరమైన ఆరోపణలు వచ్చినా, ఎక్కడా నారాయణస్వామి పాత్రపై చర్చ జరగలేదు. కానీ అనూహ్యంగా సిట్ ఆయనపై ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీని మార్చి ప్రభుత్వ దుకాణాల ద్వారా నాసిరకం మద్యం విక్రయించారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. సుమారు లక్ష కోట్ల విలువైన మద్యం విక్రయించారని, రూ. 3,500 కోట్లు కమీషన్ గా అందుకున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముందుగా ఏసీబీతో విచారణ చేయంచి అనంతరం ప్రత్యేక దర్యాప్తునకు సిట్ ను నియమించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిట్ లో పలువురు సీనియర్ పోలీసులు అధికారులు సభ్యులుగా ఉన్నారు. సిట్ దర్యాప్తులో ఇప్పటివరకు 12 మంది అరెస్టు అయ్యారు. వీరిలో వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గత సీఎంవోలో కీలకంగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, ఐటీ మాజీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డిని అరెస్టు చేశారు. దీంతో లిక్కర్ కేసులో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. అయితే ఇప్పుడు మంత్రి నారాయణస్వామి విచారణ తర్వాత సిట్ యాక్షన్ ఎలా ఉండబోతోందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో అంతిమ లబ్ధిదారును బిగ్ బాస్ గా ప్రచారం చేస్తున్న సిట్ నారాయణస్వామి తర్వాత బిగ్ బాస్ ను విచారిస్తుందా? అన్నదే సస్పెన్ష్ క్రియేట్ చేస్తోంది.
