లిక్కర్ స్కాంలో సినిమా ట్విస్టులు.. తాజా అప్డేట్ ఏంటంటే?
ఏపీ లిక్కర్ స్కాంలో పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. మంచి క్రైం కథతో సాగిన సినిమాలా ఈ కేసులో అనేక ట్విస్టులు చర్చనీయాంశం అవుతున్నాయి.
By: Tupaki Desk | 28 Nov 2025 4:10 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. మంచి క్రైం కథతో సాగిన సినిమాలా ఈ కేసులో అనేక ట్విస్టులు చర్చనీయాంశం అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా నత్తనడకగా సాగుతున్న దర్యాప్తుపై సిట్ జోరు పెంచిందని అంటున్నారు. దీంతో లిక్కర్ స్కాంలో చిక్కుముడులు అన్నీ ఒక్కొక్కటిగా వీడుతున్నాయని అంటున్నారు. కేసులో ఇటీవల అరెస్టు అయిన ముంబై వ్యాపారి ఏ49 అనిల్ చోక్రాను కస్టడీకి తీసుకుని విచారించాలని సిట్ నిర్ణయించింది. మరోవైపు హైదరాబాదులో లిక్కర్ డెన్ నుంచి రూ.5 కోట్లు కొట్టేసిన కటక్ కి‘లేడీ’ నుంచి ఆ డబ్బు రికవరీకి సిట్ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్ ఫోకస్ చేసింది.
లిక్కర్ స్కాంలో నర్రెడ్డి సునీల్ రెడ్డి పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎంకు బాగా నమ్మకస్తుడిగా సునీల్ రెడ్డిని చెబుతుంటారు. దీంతో గత ప్రభుత్వంలో ఆయన హైదరాబాద్ నుంచే చక్రం తిప్పాడని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా లిక్కర్ స్కాంలో ఆయన పాత్రపై కొన్ని ఆధారాలు లభించాయని అంటున్నారు. అప్పట్లో ఊరూ పేరు లేని కొన్ని బ్రాండ్లను సునీల్ రెడ్డి తీసుకువచ్చారని ప్రచారం జరుగుతోంది.
తన పరపతితో కొన్ని మద్యం బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాలలో అమ్మించి సునీల్ రెడ్డి సొమ్ము చేసుకున్నాడని, ఈ డబ్బులతో దుబాయ్ లో ఆస్తులు కూడబెట్టారని సిట్ ఆరోపిస్తోంది. దీనిపై వివరాలు సేకరించేందుకు రెండు రోజులుగా సునీల్ రెడ్డిని విచారిస్తోంది. తమ వద్ద ఉన్న ఆధారాలతో సునీల్ రెడ్డిని ఏక్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవాద వర్గాలు అనుమానిస్తున్నాయి. అదే జరిగితే మాజీ సీఎం జగన్ చుట్టు ఉన్న కీలకమైన వ్యక్తులను లిక్కర్ కేసులో అరెస్టు చేసినట్లేనని అంటున్నారు.
ఇక ఇదే కేసుకు సంబంధించి హైదరాబాదు డెన్ లో దాచిన నగదు రూ.5 కోట్లను ఒడిశాకు చెందిన ఓ మహిళతోపాటు ఆమె ప్రియుడు, మరో వ్యక్తి దొంగిలించారని సిట్ పసిగట్టింది. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, వారు డబ్బు దాచిన విషయం అంగీకరించారని చెబుతున్నారు. అయితే నిందితులు ఆ డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేశారని సమాచారం. ఒడిశా, తెలంగాణల్లో ఆ అస్తులు ఉండటంతో సీజ్ చేయడం సిట్ పోలీసులుకు సవాల్ గా మారిందని అంటున్నారు.
దీంతో నిందితులు ముగ్గురికీ ఒక చాన్స్ ఇస్తూ దొంగ సొత్తుతో కొనుగోలు చేసిన ఆస్తులు అమ్మి నగదు అప్పగించాల్సిందిగా పోలీసులు సూచించడం చర్చనీయాంశం అవుతోంది. ఇలా చేస్తే తమపై దొంగతనం కేసు తీసేస్తామని నిందితులకు పోలీసులు ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏ49 అనిల్ చోక్రాను సిట్ కస్టడీకి తీసుకోవడంతో ఇతర నిందితుల్లో టెన్షన్ కనిపిస్తోందని చెబుతున్నారు. లిక్కర్ సొమ్ములను వైట్ గా మార్చడానికి అనిల్ చోక్రా సూటుకేసు కంపెనీలను ఉపయోగించారని సిట్ చెబుతోంది. ఇప్పటికే ఈడీ కేసుల్లో అరెస్టు అయిన అనిల్ చోక్రా లిక్కర్ కేసులో పెదవి విప్పితే.. నిందితులకు ఇబ్బందే అంటున్నారు. జైలులో ఉన్నవారితోపాటు అరెస్టు కావాల్సినవారు సైతం అనిల్ చోక్రా కస్టడీతో టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి లిక్కర్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ సినిమా సన్నివేశాలను తలపిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
