బిగ్ బ్రేకింగ్ : సిట్ విచారణకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి
ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులు రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరయ్యారు.
By: Tupaki Desk | 14 May 2025 5:03 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో నిందితులు రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరయ్యారు. గత కొంతకాలంగా సిట్ అధికారులకు చిక్కకుండా బెయిల్ ప్రయత్నాల్లో ఉన్న ఈ ఇద్దరు సుప్రీంకోర్టు కల్పించిన రక్షణతో సిట్ విచారణ నిమిత్తం బుధవారం విజయవాడ కమిషనరేట్ కు వచ్చారు. ప్రస్తుతం ఆ ఇద్దరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కాంలో ఏ 31గా నమోదైన ధనుంజయరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, గత ప్రభుత్వంలో సీఎంవో కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా ఇదే కేసులో ఏ32గా నమోదైన కృష్ణమోహన్ రెడ్డి గ్రూప్-1 అధికారి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. గత ప్రభుత్వంలో సీఎం ఓఎస్డీగా కూడా సేవలు అందించారు. గతంలో కీలక బాధ్యతలు చూసిన ఈ ఇద్దరు ఇప్పుడు లిక్కర్ స్కాంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారని ప్రచారం జరుగుతోంది.
ముందస్తు బెయిల్ కోసం ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను ఈ నెల 16న సుప్రీంకోర్టు విచారించనుంది. అంతవరకు వారిని అరెస్టు చేయొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అదే సమయంలో సిట్ విచారణకు సహకరించాలని నిందితులను ఆదేశించింది. దీంతో బుధవారం అండర్ గ్రౌండు నుంచి బయటకు వచ్చిన నిందితులు సిట్ విచారణకు హాజరయ్యారు. వీరితోపాటు ఏ33గా అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్, చార్టెడ్ అకౌంటెంట్ గోవిందప్ప బాలాజీని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ లభించకపోవడంతో ఈ ముగ్గురు పరార్ అవ్వగా, గోవిందప్ప బాలాజీ మైసూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక సుప్రీంకోర్టు కల్పించిన వెసులుబాటుతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బయటకు వచ్చారు.
గత ప్రభుత్వంలో సీఎంవోలో పనిచేసిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ తయారీ నుంచి ప్రతి విషయంలోనూ కీలకంగా వ్యవహరించారని సిట్ ఆరోపిస్తోంది. బ్రూవరీస్, డిస్టలరీస్ నుంచి వసూలు చేసిన కమీషన్లను ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి అందజేసేవారమని స్కాంలో మిగిలిన నిందితులు వాంగ్మూలాలివ్వడంతో వారి మెడకు స్కాం ఉచ్చు బిగుసుకుంది. ఏ1 కేసిరెడ్డి రాజ్ రెడ్డితోపాటు మరో నిందితుడు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లు చెప్పిన వెంటనే వారిద్దరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అయితే రెండు కోర్టులూ ప్రతికూలంగా తీర్పునిచ్చిన తర్వాత వారిని ఏ31, ఏ32గా చేర్చుతూ సిట్ మెమో వేసింది. ఆ తర్వాత మళ్లీ నిందితులు కోర్టును ఆశ్రయించడంతో విచారణకు అనుమతినిచ్చి ఈ నెల 16 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
కీలక అధికారులుగా బాధ్యతలు చేపట్టిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ సర్వత్రా ఆసక్తి రేపుతోంది. గత ప్రభుత్వంలో సీఎంవో కార్యదర్శిగా సకల వ్యవస్థలను శాసించిన ధనుంజయరెడ్డి ఇప్పుడు సాధారణ నిందితుడిగా పోలీసుల ఎదుట హాజరుకావడంపై పెద్ద చర్చ జరుగుతోంది. విచారణలో పోలీసులు ఏం ప్రశ్నించనున్నారు? ఈ కేసు దర్యాప్తు ఇక్కడితో ఆగిపోతుందా? ఇంకా ఎవరైనా నిందితులుగా తెరపైకి వస్తారా? అనేది చర్చ జరుగుతోంది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చే వాంగ్మూలం, వారు చెప్పే సమాధానాలు వల్ల వైసీపీలో ‘ముఖ్య’ నేతల భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు. దీంతో నిందితుల విచారణ హైటెన్షన్ గా మారింది.
