ఏపీ మద్యం స్కాం.. రూ.3,200 కోట్లు పైనే..?
ఏపీ మద్యం స్కాంలో కమీషన్ల కింద పోగేసిన మొత్తం భారీగా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గుర్తించారని చెబుతున్నారు.
By: Tupaki Desk | 30 April 2025 10:30 AMఏపీ మద్యం స్కాంలో కమీషన్ల కింద పోగేసిన మొత్తం భారీగా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గుర్తించారని చెబుతున్నారు. తొలుత అంచనా వేసినట్లు రూ.3,200 కన్నా ఎక్కువగానే మద్యం దందా నడిపినట్లు సిట్ ఆధారాలు సేకరించిందని ప్రచారం జరుగుతోంది. కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి అరెస్టు, ఆ తర్వాత విచారణలో మద్యం స్కాంలో కమీషన్ పై సిట్ అధికారులు పక్కా లెక్కలు సేకరించిందని ప్రచారం జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మద్యం స్కాంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. తొలుత సీఐడీ అధికారులతో విచారణ జరిపించిన ప్రభుత్వం.. కేసులో పెద్దల హస్తం ఉందని బయటపడటంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఆరుగురు సీనియర్ పోలీసు అధికారులు ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది అక్టోబరులో నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించింది. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అంతకు ముందు ఉన్న బ్రాండ్లను కాకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాకుండా అనామక బ్రాండ్లను తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో అధికారం చేపట్టగానే తొలుత మద్యం స్కాం మూలాలు వెలికితీసే పని ప్రారంభించింది.
కేసు దర్యాప్తులో ప్రతి నెలా రూ.60 కోట్లు చొప్పున మొత్తం రూ.3,200 కోట్లు కమీషన్ కింద పోగేసినట్లు తొలుత అభియోగాలు మోపారు. అయితే కీలక నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ మొత్తంపై ఇంకా స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం, సిట్ పోలీసులు అనుమానిస్తున్న మొత్తం రూ.3,200 కోట్లకు మించి ఎక్కువగా కమీషన్ రూపంలో దండుకున్నట్లు చెబుతున్నారు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం ను తలదన్నేలా ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సిట్ మరింత దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.