Begin typing your search above and press return to search.

లిక్కర్ కేసులో ‘ఆ నలుగురు’.. నేడో రేపో సిట్ నోటీసులు జారీ చేసే చాన్స్

ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నారా? అనే చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   8 Sept 2025 4:43 PM IST
లిక్కర్ కేసులో ‘ఆ నలుగురు’.. నేడో రేపో సిట్ నోటీసులు జారీ చేసే చాన్స్
X

ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నారా? అనే చర్చ జరుగుతోంది. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని భావిస్తున్న తరుణంలో రోజుకో కొత్త పేరు తెరపైకి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేతను విచారించిన సిట్ అధికారులు ఆయన ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు ప్రధాన నేతలకు కూడా ఈ స్కాంలో లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు మాజీ మంత్రులు ఉండగా, ఒక మాజీ ఎమ్మెల్యే, ఇంకొకరు ఓ మాజీ మంత్రికి సమీప బంధువుగా చెబుతున్నారు. ఈ నలుగురు రాజకీయంగా ఆయా జిల్లాల్లో బలమైన నేపథ్యం ఉన్నవారు కావడంతో పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు 12 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మొత్తం 40 మందిని నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఈ వ్యవహారంపై ఆధారాల సేకరణ కోసమంటూ పలువురు నేతలు, అధికారులను సిట్ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కీలక నేత ఇచ్చిన సమాచారంతో కొద్దిరోజుల క్రితం కొందరు వైసీపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు వారికి తోడుగా మరో నలుగురు పేర్లను ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఒకరు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న రాజకీయ కుటుంబానికి చెందిన నేత కావడం గమనార్హం. ఇక మిగిలిన ముగ్గురిలో ఒకరు గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి అయితే మరోకరు డెల్టా ప్రాంతానికి చెందిన మరో మాజీ మంత్రి అంటున్నారు. వీరితో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకూ లిక్కర్ సొమ్ములు అందినట్లు సిట్ లీకులు ఇస్తోందని అంటున్నారు.

తాజాగా ప్రచారం జరుగుతున్న నలుగురు కూడా వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్న వారు కావడం గమనార్హం. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నేత కొద్ది రోజుల క్రితం తనను ఏదో ఒక కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయంగా చెప్పడం విశేషమంటున్నారు. ఆయనపై వేరే ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించగా, అన్ని కేసులు ఎందుకు లిక్కర్ కేసులో నా పేరు పెట్టొచ్చు కదా? అంటూ సదరు నేత ప్రశ్నించారు. ఆయన ఊహించి అన్నారో లేక అప్పటికే సమాచారం ఉందో గానీ, ఇప్పుడు ఆ మాజీ మంత్రి పేరు కూడా ప్రభుత్వ అనుకూల మీడియా తెరపైకి తెచ్చింది. లిక్కర్ స్కాంలో ఆయనకు వాటాలు అందినట్లు ప్రచారం చేస్తోంది.

అయితే ఈ నలుగురికి లిక్కర్ స్కాంలో మిగిలిన నిందితులకు లింకు ఉన్నట్లు అమ్మకాలు, కమీషన్లతో సంబంధాలు ఉన్నాయా? లేక వేరే ఇంకేమేనా వ్యవహారాలు నడిపారా? అనేది చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ నలుగురు ప్రాంతాల వారీగా రవాణా, సెక్యూరిటీ సర్వీసు, హోలో గ్రామ్ కాంట్రాక్టు, అట్ట పెట్టెల అమ్మకాల్లో స్కాంకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డిపోల నుంచి మద్యం సరఫరా కాంట్రాక్టు, వారి నుంచి కమీషన్లు వసూలు చేసినట్లు సిట్ సమాచారం సేకరించిందని అంటున్నారు. అదేవిధంగా అట్ట పెట్టెల అమ్మకాల్లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఆ నేతలను పిలిచి వివరణ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.