లిక్కర్ కేసులో ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఏ1 కేసిరెడ్డిపై తీవ్రమైన చర్యలకు రంగం సిద్ధం
లిక్కర్ స్కాంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజ్ కేసిరెడ్డి పలు వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ చెబుతోంది.
By: Tupaki Desk | 21 Aug 2025 1:49 PM ISTఏపీ లిక్కర్ స్కాంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐటీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఆస్తుల జప్తునకు ఆదేశించింది. దీంతో అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాంలో అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో కేసిరెడ్డి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రభుత్వానికి సిట్ అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో కేసిరెడ్డి ఆస్తులపై ఎటువంటి లావాదేవీలు నిర్వహించకుండా జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లిక్కర్ స్కాంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజ్ కేసిరెడ్డి పలు వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ చెబుతోంది. ప్రధానంగా ఈడీ క్రియేషన్స్ పేరిట సినిమాలు నిర్మించినట్లు ఆయనపై అభియోగాలు నమోదు చేసింది. అదేవిధంగా బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు పలు లావాదేవీలు నిర్వహించినట్లు కనుగొంది. ఇందులో భాగంగా రూ.13 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. వీటిని జప్తు చేసేందుకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి లిక్కర్ వ్యాపారాన్ని పర్యవేక్షించారని, స్కాంలో సర్వం తానై వ్యవహరించారని సిట్ అభియోగాలు నమోదు చేసింది. దర్యాప్తులో ఆయన పాత్రపై బలమైన ఆధారాలు సేకరించి చార్జిషీటులో పొందుపరిచింది. మరోవైపు రాజ్ కేసిరెడ్డితోపాటు ఆయన అనుచరులు, సన్నిహితులు, స్నేహితులను కూడా స్కాంలో అరెస్టు చేసింది. వీరిలో కొందరు ఇచ్చిన సమాచారంతో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ మండలంలో రూ.11 కోట్ల నగదును సీజ్ చేసింది. ఈ డబ్బు తనది కాదని రాజ్ కేసిరెడ్డి కోర్టుకు విన్నవించినా, ఆయన వ్యాపార భాగస్వామి వ్యవసాయ క్షేత్రంలో డబ్బు నిల్వ చేసినట్లు సహ నిందితులు ఇచ్చిన సమాచారంతో కేసిరెడ్డిపై ఉచ్చు బిగించింది ప్రభుత్వం.
ఇక తాజా ఆదేశాలతో కేసిరెడ్డి మరిన్ని సమస్యలను ఎదుర్కోబోతున్నట్లు భావిస్తున్నారు. లిక్కర్ స్కాంలో ఏ1గా కేసిరెడ్డిని నిర్ధారించిన తర్వాత ఏప్రిల్ 21న హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా కేసిరెడ్డి ఉన్నారు. ఈ కేసులో మొత్తం 48 మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో కొన్ని వ్యాపార సంస్థలు, డిస్టలరీలు కూడా ఉన్నాయి. కాగా, నిందితుల్లో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేయగా, ఏ ఒక్కరికీ బెయిలు రాలేదు. ప్రధాన నిందితుడు కేసిరెడ్డితోటు మిగిలిన పది మంది విజయవాడ జైలులో ఉండగా, ఏ5 మిథున్ రెడ్డిని భద్రతా కారణాల రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. ఇక ప్రస్తుతం ఏ1 కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశించగా, రానున్న రోజుల్లో మిగిలిన నిందితుల ఆస్తులను అటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
