రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏముంది?
సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు కావటం తెలిసిందే.
By: Tupaki Desk | 23 April 2025 11:35 AM ISTసంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు కావటం తెలిసిందే. ఆయన్ను విచారించిన సిట్.. తాజాగా రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. అయితే.. విచారణ వేళ పలు అంశాల్ని చెప్పిన రాజ్ కసిరెడ్డి.. సిట్ సిద్ధం చేసిన నేరాంగీకరపత్రం మీద మాత్రం సంతకం చేసేందుకు నో చెప్పినట్లుగా సిట్ పేర్కొంది.
తాజాగా వెలుగు చూసిన సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న కీలక అంశాలివే..
- ప్రభుత్వానికి.. పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కువుట్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్ నాకు బాధ్యత అప్పగించారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని.. పథకాల అమలుకూ ఆదాయాన్ని సమకూర్చాలని నిర్దేశించారు.
- ఈ నేపథ్యంలోనే బేవరేజెస్ కార్పొరేషనే లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి.. మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించాం. ఐఆర్ టీఎస్ అధికారి వాసుదేవరెడడిని.. డిప్యూటేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చాం. తొలుత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా.. ఆ తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా.. ఆ తర్వాత బేవరేజెస్.. డిస్టలరీస్ కమిషనర్ గా నియమించారు.
- మద్యం అమ్మకాలు.. కొనుగోళ్లు.. లేబుల్ రిజిస్ట్రేషన్ తదితర కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ వాసుదేవరెడ్డికే దక్కేలా చూశారు. మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన నా ప్లాన్ ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్ కు అప్పగించాం.
- 2023లో ఆయనకు సివిల్ సర్వీసు కోటాలో ఐఏఎస్ హోదా ఇప్పిస్తామని మాట ఇచ్చాం.మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా నియమించాం. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్ లోని విజయసాయి రెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేశాం. దీనికి సంబంధించిన మీటింగ్ 2019 అక్టోబరు 13న ఆయన ఇంట్లోనే జరిగింది.
- విజయసాయిరెడ్డి.. మిథున్ రెడ్డి..సజ్జల శ్రీధర్ రెడ్డి.. మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ ఈ మీటింగ్ లో పాల్గొన్నాం. మద్యం ఉత్పత్తిదారుల నుంచి డిస్టలరీస్ నుంచి నెలకు రూ.50-60 కోట్లు ముడుపులు వచ్చేలా స్కీమ్ రూపొందించాం. ఇదే విషయాన్ని సత్యప్రసాద్ కు చెప్పాం.
- ఆయా బ్రాండ్లకు సంబంధించి 3 నెలల అమ్మకాలు.. దానిపై పది శాతం పెరుగుదలతో కలిపి స్టాక్ ఇచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అయితే.. ఈ విధానం అమల్లో ఉండే మేం అనుకున్నట్లుగా జరగదు. అందుకే మద్యం సరఫరాను ఆన్‌లైన్ తో డిసైడ్ కాకుండా ఉండాలని నిర్ణయించాం. ఏ బ్రాండ్‌ను ఎంతమేర సరఫరా చేయాలో, రిటైల్ షాపులో ఏవి అమ్మాలో మేమే డిసైడ్ చేయాలి. అలా మద్యం ఉత్పత్తి.. సరఫరా.. సేల్స్ మొత్తాన్నిమా కంట్రోల్ లోకి తెచ్చుకున్నాం.
- 2019 డిసెంబరులో ఒక ప్రైవేటు బంగ్లాలో నేను.. మిథున్ రెడ్డి.. సజ్జల శ్రీధర్ రెడ్డి.. బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి మీటింగ్ పెట్టుకున్నాం. మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు వచ్చేలా ప్లాన్ చేశాం. మేం నిర్ణయించిన మద్యం ముడుపుల ప్రకారం ప్రతి నెలా కనీసం రూ.50-60 కోట్లు వచ్చేవి.
- ఎంత మద్యం సరఫరా అయ్యింది. అమ్మకాలు ఎంత జరిగాయన్న డేటా ప్రతినెలా వచ్చేది. ఇందుకోసం అనూష.. సైఫ్ అనే ఉద్యోగుల్ని నియమించుకున్నాం. ప్రతినెలా ఐదో తేదీన కమీషన్లు లెక్కలు వేసేవాళ్లం.. వీరిచ్చే డేటా ఆధారంగా కిరణ్ కుమార్ రెడ్డి.. బోనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ లు ఆయా కంపెనీలకు ఫోన్లు చేసేవారు. కంపెనీలు ముడుపుల సొమ్ములు ఇచ్చాక.. వాటిని నా దగ్గరకు చేర్చేవారు. ఆ తర్వాత ఆ డబ్బుల్ని తీసుకొని ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి.. బాలాజీకి పంపేవాడ్ని.
