Begin typing your search above and press return to search.

మద్యం స్కాం.. నారాయణస్వామి మరింత ఇరికించేశారా?

మద్యం స్కాంపై తమ సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 21 (సోమవారం) విచారణకు రావాలని సిట్ మాజీ మంత్రి నారాయణస్వామికి నోటీసులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   22 July 2025 3:37 PM IST
మద్యం స్కాం.. నారాయణస్వామి మరింత ఇరికించేశారా?
X

ఏపీ లిక్కర్ స్కాం అనేక మలుపులు తిరుగుతోంది. రూ.3,500 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని, దేశంలో ఇప్పటివరకు వెలుగుచూసిన మద్యం స్కాముల్లో కెల్లా ఇదే పెద్దదని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీసు అధికారుల బృందం తమ విచారణను చివరి దశకు చేర్చినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 40 మందిని నిందితులుగా చూపగా, 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో వైసీపీ ఎంపీ, మాజీ సీఎం జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి అరెస్టుతో కేసు క్లైమాక్స్ కు చేరిందని భావిస్తున్నారు. ఇక మిగిలింది అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు అప్పటి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని సోమవారం విచారించారు. ఇందులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నిందితులను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుందా? అన్న అనుమానాలను రేకెత్తిస్తోందని అంటున్నారు.

మద్యం స్కాంపై తమ సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 21 (సోమవారం) విచారణకు రావాలని సిట్ మాజీ మంత్రి నారాయణస్వామికి నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలు చూపుతూ ఆయన ఆ విచారణ నుంచి తప్పించుకోవాలని చూశారని అంటున్నారు. కానీ, రెండో చార్జిషీటు దాఖలు చేయడానికి సమయం లేకపోయినందున మాజీ మంత్రి నారాయణ స్వామి వాంగ్మూలం నమోదుకు విచారణను వాయిదా వేయాలని సిట్ భావించలేదు. దీంతో తిరుపతిలోని నారాయణ స్వామి నివాసానికి పోలీసులను పంపి వీడియో కాల్లో ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. అయితే ఈ సమయంలో కొన్ని ప్రశ్నలకు తప్పించుకోవాలని చూసిన నారాయణస్వామి, లిక్కర్ స్కాంలో ఇప్పటికే అరెస్టు చేసిన వారిని ఇరికించేలా వాంగ్మూలం ఇచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లిక్కర్ పాలసీపై అడిగిన ప్రశ్నకు తనకు ఏదీ తెలియదన్న నారాయణస్వామి సమాధానం అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఇరకాటంలో పెట్టేదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకువచ్చారని తనకు చెప్పినట్లు నారాయణస్వామి వాంగ్మూలమిచ్చినట్లు చెబుతున్నారు. ఎక్సైజ్ మంత్రిగా పాలసీపై నిర్ణయం తీసుకుని కేబినెట్లో ప్రతిపాదించాల్సిన వ్యక్తి తనకు ఎవరో చెప్పారన్నట్లు స్టేట్ మెంట్ ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

సుమారు 30 నిమిషాల పాటు 14 ప్రశ్నలను నారాయణస్వామికి వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కీలక ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్లు చెబుతున్నారు. ఇక లిక్కర్ స్కాంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ఎవరో తనకు తెలియదని, ఆయనను తాను ఎప్పుడూ కలవలేదని మాజీ మంత్రి నారాయణస్వామి చెప్పినట్లు సమాచారం. కాగా, నారాయణస్వామి వాంగ్మూలం ద్వారా ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే పాలసీ రూపకల్పన జరిగిందనే విషయాన్ని రుజువు చేసేందుకు సిట్ పావులు కదుపుతున్నట్లు న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.