Begin typing your search above and press return to search.

సర్వం మిథున్ రెడ్డి.. లిక్కర్ స్కాం దర్యాప్తులో సంచలన విషయాలు

అయితే ఈ కేసులో ఏ4గా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత స్కాం మొత్తానికి ఆయనే సూత్రధారి అంటూ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   22 July 2025 12:32 PM IST
సర్వం మిథున్ రెడ్డి.. లిక్కర్ స్కాం దర్యాప్తులో సంచలన విషయాలు
X

ఏపీలో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా నాటి ఐటీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి గతంలో ఆరోపించారు. అయితే ఈ కేసులో ఏ4గా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత స్కాం మొత్తానికి ఆయనే సూత్రధారి అంటూ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దీంతో ఈ స్కాంలో ఎవరి పాత్ర ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మద్యపాన నిషేధం అమలు చేస్తామని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఆ తర్వాత మద్యం కుంభకోణానికి తెరతీసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాకుండా నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలను హరించడంతోపాటు వారి అనారోగ్యానికి కారణమయ్యారని తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

లిక్కర్ స్కాంలో ‘బిగ్ బాస్’కు అన్నిరకాలుగా రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహకరించారని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ పేర్కొంది. మిథున్ రెడ్డి రిమాండు రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావించిన సిట్ కేసులో మరికొందరి పాత్ర త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది. మరోవైపు స్కాంపై ప్రజల్లో చర్చ జరగాలని భావిస్తున్న ప్రభుత్వం, టీడీపీ పార్టీ పలు ఆరోపణలను ప్రచారంలోకి తీసుకు వచ్చాయి. ప్రభుత్వ మద్యం విధానాన్ని మార్చేసిన జగన్ ప్రభుత్వం రూ.రూ.3,500 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు విమర్శలు గుప్పిస్తున్నాయి.

జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం మద్యం పాలసీని మార్చి కల్తీ మద్యాన్ని ఏరులై పారించిందని ప్రభుత్వం చెబుతోంది. ఆ కల్తీ మద్యాన్ని తాగి వైసీపీ పాలన కాలంలో సుమారు 30 వేల మందికి పైగా మృతి చెందారని, దాదాపు 35లక్షల మంది కిడ్లు, లివర్ వ్యాధులతో ఆసుపత్రి పాలైనట్లు ప్రభుత్వ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు నిర్మించారని, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌, దుబాయి, ఆఫ్రికా దేశాలకు షెల్ కంపెనీల ద్వారా డబ్బు తరలించారని వివరిస్తోంది. అంతేకాకుండా లిక్కర్ డబ్బునే గత ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు కొన్ని ఆధారాలు చూపుతోంది ప్రభుత్వం.

దేశంలో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం మద్యంలో హానికరమైన పైరోగలాల్, డై ఇథైల్‌ థాలేట్‌, ఐసోపులెరిక్‌ యాసిడ్ వంటి రసాయనాలు ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతోంది. ఈ కారణంగానే గతంలో మద్యం తాగిన వారికి లివర్, కిడ్నీ సమస్యలు, కడుపులోను నోట్లో పుండ్లు పుట్టాయని, తాగిన తర్వాత పిచ్చి పిచ్చిగా వ్యవహరించారని ఆరోపణలు గుప్పిస్తోంది. ఇక స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకమని ప్రభుత్వం చెబుతోంది.

మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరిపి ముడుపులు ఇచ్చిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూశారని, మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులు తాడేపల్లి ‘బిగ్‌బాస్‌’కు చేర్చటంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెబుతోంది. పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల వరకు పాత్ర మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఐఆర్ఎస్ అధికారి వాసుదే వరెడ్డిని డిప్యుటేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా, డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషన ర్గా నియమించటంలో, ఎక్సైజ్ శాఖాధికారి డి. సత్యప్రసాద్ కి కన్ఫర్డ్ ఐఏఎస్ గా పదోన్నతి కల్పిస్తానని ప్రలోభపెట్టి.. ఆయన్ను పావుగా వాడుకుని దోపిడీ సాగించటంలో మిథున్ రెడ్డిది ప్రధాన పాత్ర వహించినట్లు కోర్టుకు నివేదించింది.

భారీగా కమీషన్లు

మద్యం బ్రాండ్ల మూల ధర ఆధారంగా కేసుకు రూ.150 నుంచి రూ.600 వరకు ముడుపులు వసూలు చేశారని, తద్వారా నెలకు రూ.50-60 కోట్ల మేర మిథున్ రెడ్డి దండుకున్నారని సిట్ విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు. ముడుపుల వసూళ్లు, సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవటం ద్వారా మిధున్ రెడ్డి రెండు విధాలా లబ్ది పొందారని ఆరోపిస్తున్నారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ (డిస్టిలరీ) వ్యాపార పునరుద్ధరణ, అభివృద్ధి కోసం అరబిందో గ్రూప్ ద్వారా రూ.45 కోట్ల రుణమిప్పించడంతో కీలక పాత్ర ఎంపీ మిథున్ రెడ్డిదేనని చెబుతున్న ప్రభుత్వం, మద్యం ముడుపుల్లో ప్రతినెల రూ.5 కోట్లను ఎంపీ మిథున్ రెడ్డి తన వాటాగా వసూలు చేసినట్లు ఆరోపిస్తోంది. ఈ మొత్తం మిధున్ రెడ్డి కుటుంబీ కులు డైరెక్టర్లుగా ఉన్న PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో జమ చేయించుకున్నట్లు వెల్లడైందని చెబుతోంది.

రూ. 1.24లక్షల కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించి తెరచాటున పెద్ద ఎత్తున దోపిడి పాల్పడ్డారని ఆరోపిస్తున్న సిట్ కోర్టులో దాఖలు చేసిన 305 పేజీల ప్రాథమిక చార్జిషీట్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం సంచలనంగా మారింది. ఈ కుంభకోణంలో నిందితులంతా జగన్‌కు సన్నిహితులేనని, జగన్ ఆదేశాల మేరకు స్కామ్ నడిచినట్లు సిట్ వెల్లడించిందని అధికార టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.