Begin typing your search above and press return to search.

మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం? వైసీపీ ఎంపీ భవిష్యత్తు ఏంటి!

ఏపీ లిక్కర్ స్కాంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకునే మార్గాలపై వైసీపీ అన్వేషిస్తోంది.

By:  Tupaki Desk   |   16 July 2025 7:00 PM IST
మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం? వైసీపీ ఎంపీ భవిష్యత్తు ఏంటి!
X

ఏపీ లిక్కర్ స్కాంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకునే మార్గాలపై వైసీపీ అన్వేషిస్తోంది. మద్యం స్కాంలో ఏ4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ ను తాజాగా కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఇక హైకోర్టు తీర్పుతో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ముందస్తు బెయిలు కోసం ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

లిక్కర్ స్కాంలో రూ.3,200 కోట్లు కొల్లగొట్టారని ఇందులో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించారు. దీనికి ప్రాథమిక ఆధారాలు కోర్టు ముందు ఉంచడంతో ఎంపీ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. వాస్తవానికి మిథున్ రెడ్డిని నిందితుడుగా గుర్తించకముందే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తను అరెస్టు కాకుండా రక్షించాలని వేడుకున్నారు. అయితే అప్పటికి నిందితుల జాబితాలో మిథున్ రెడ్డి పేరు లేనందున అరెస్టు చేయొద్దని విచారణకు పిలవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ తర్వాత మిథున్ రెడ్డిని నిందితుల జాబితాలో చేర్చడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు.

అయితే ఎంపీ పిటిషనును విచారించిన సుప్రీంకోర్టు, బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లమని సూచించింది. ఇప్పుడు హైకోర్టులో నిరాశే ఎదురవడంతో ఆయన మళ్లీ సుప్రీంను ఆశ్రయించే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అయితే మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నందున సుప్రీం నిర్ణయం ఎలా ఉంటుందన్న టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. లిక్కర్ స్కాంలో దాదాపు 40 మంది నిందితులుగా ఉండగా, కీలక నిందితులుగా అనుమానిస్తూ ప్రస్తుతానికి 11 మందిని అరెస్టు చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సైతం అరెస్టు చేయాలన్న టార్గెట్ తోనే ప్రభుత్వం పావులు కదుపుతోందని ఆ పార్టీ అనుమానిస్తోంది. మాజీ సీఎం జగన్మోహనరెడ్డి అత్యంత సన్నిహితులైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సీఎంవో మాజీ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు.

అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడుగా చెబుతున్నారు. లిక్కర్ స్కాం మొత్తం మిధున్ రెడ్డి ద్వారానే అంతిమ లబ్ధిదారుకు చేరినందున ఈ కేసులో ఆయన పాత్ర కీలకంగా సిట్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకోవడం ఎలా అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు అయితే ఆ ద్వారా అంతిమ లబ్ధిదారు పేరు చెప్పించాలని సిట్ భావిస్తోందని అంటున్నారు. ఇప్పటివరకు అరెస్టు అయిన నిందితులు ఎవరూ బిగ్ బాస్ పేరు చెప్పలేదని అంటున్నారు. బిగ్ బాస్ పేరుచెబితే తాము ప్రాణాలతో ఉండమని నిందితులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మిథున్ రెడ్డి ద్వారా బిగ్ బాస్ పేరు బయటపెట్టే పథకం సిద్ధమవుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.