మద్యం ముడుపుల కోసం ప్రైవేటు సైన్యం.. దర్యాప్తులో సంచలన విషయాలు!
ఏపీ లిక్కర్ స్కాంలో రోజుకు ఓ సంచలన విషయం వెలుగు చూస్తోంది. దాదాపు రూ.3,200 కోట్ల మేర జరిగిన కుంభకోణంలో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందన్న విషయమై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 21 Jun 2025 4:00 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో రోజుకు ఓ సంచలన విషయం వెలుగు చూస్తోంది. దాదాపు రూ.3,200 కోట్ల మేర జరిగిన కుంభకోణంలో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందన్న విషయమై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి అరెస్టు తర్వాత లిక్కర్ లింకులను ఒక్కొక్కటిగా ఛేదిస్తూ వస్తున్న పోలీసు అధికారులు డబ్బు తరలింపునకు పెద్ద యంత్రాంగమే పనిచేసినట్లు గుర్తించారని అంటున్నారు. దీంతో మద్యం స్కాంలో వంద మందికి పైగా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మద్యం స్కాంలో సుమారు 39 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 9 మందిని ప్రస్తుతానికి అరెస్టు చేశారు. కేసులో బిగ్ బాస్ ను పట్టుకునేందుకు ఆధారాల కోసం అన్వేషిస్తున్న పోలీసులు.. ముందుగా నెట్ వర్కులో పాల్పంచుకున్న వారిని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. దీంతో మద్యం ముడుపులు స్వీకరించిన వారు, వాటిని రకరకాల మార్గాల ద్వారా తరలించిన వారిని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇంకా పలువురి పాత్రపై దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో లిక్కర్ డబ్బు రవాణా చేసిన వారు పరార్ అవుతున్నట్లు చెబుతున్నారు.
అయితే లిక్కర్ డబ్బు ముందుగా ఎక్కడకు చేరింది.. ఆ తర్వాత ఎక్కడకు వెళ్లిందన్న విషయమై దర్యాప్తు చేసిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయని చెబుతున్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో డబ్బును గమ్యస్థానాలకు చేర్చేందుకు ఓ పకడ్బందీ నెట్ వర్క్ ఏర్పాటు చేశారని గుర్తించినట్లు సమాచారం. డిస్టలరీల నుంచి వసూలు చేసిన మద్యం ముడుపులు ఎన్నికల ముందు నేరుగా ‘తాడేపల్లి’లోని ఒక ప్లాటుకు చేరాయి. అక్కడి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులకు డబ్బులు చేరవేసినట్లు చెబుతున్నారు. ఈ క్యాష్ హ్యాండ్లింగులో కట్టా ప్రణయ్ ప్రకాశ్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి.
రాజ్ కసిరెడ్డి బృందంలో కట్టా ప్రణయ్ ప్రకాశ్ అత్యంత కీలకంగా చెబుతున్నారు. మద్యం కేసుపై సెట్ దర్యాప్తు ప్రారంభించిన వెంటనే అతడు విదేశాలకు వెళ్లిపోవడంపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. కట్టా ప్రణయ్ ప్రకాశ్ మద్యం రవాణాకు ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలో పనిచేసినట్లు చెబుతున్నారు. మద్యం ముడుపులను గమ్యస్థానాలకు చేర్చేందుకు నాలుగైదు చేతులు మారినట్లు చెబుతున్నారు. ఫీల్డ్ మానిటర్స్, ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ, క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్, ఫీల్డ్ ఆపరేటింగు సర్వీసు ఇలా మొత్తం ఓ పెద్ద వ్యవస్థను నడిపారని అంటున్నారు.
మద్యం కమీషన్లు ఫిక్స్ చేసి, వాటిని వసూలు చేసి డబ్బును ఓ చోట భద్ర పరచి, తిరిగి నిర్దిష్ట గమ్యస్థానాలకు చేర్చేందుకు ఈ టీమ్స్ పనిచేసినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ టీమ్స్ లో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనేది గ్రామ వలంటీర్లు, సచివాలయాల సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ కోసం ఏర్పాటైన సంస్థ కావడం విశేషం. మద్యం ముడుపుల రవాణాకు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని వాడుకున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలో కీలకంగా పనిచేసిన ప్రణయ్ ముడుపుల సమాచారాన్ని పక్కాగా సేకరించి, ముడుపులు ఇచ్చిన కంపెనీల బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చేవారని చెబుతున్నారు.
ప్రణయ్ ఇచ్చిన ఆర్డర్లు ప్రకారమే మద్యం డిస్టలరీల నుంచి బెవరేజెస్ డిపోలకు వెళ్లేదని, అక్కడి నుంచి షాపులకు చేరేదని అంటున్నారు. డేటా ఆపరేటర్ సైఫ్ ద్వారా సమాచారం సేకరించడం, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ సమన్వయం చేసుకోవడం వంటి బాధ్యతలు ప్రణయ్ నిర్వహించాడని సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రణయ్ ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో అతడిని రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రణయ్ ను అదుపులోకి తీసుకుంటే మిగిలిన దశల్లో పనిచేసిన వారి గుట్టురట్టవుతుందని అంటున్నారు.
