Begin typing your search above and press return to search.

తెలియదు.. మరచిపోయా.. గుర్తులేదు.. లిక్కర్ స్కాంలో కేసిరెడ్డి

ఈ నేపథ్యంలో శుక్రవారం జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్న సిట్ కేసిరెడ్డిని అన్ని విధాలుగా విచారిస్తోంది.

By:  Tupaki Desk   |   3 May 2025 2:21 PM IST
తెలియదు.. మరచిపోయా.. గుర్తులేదు.. లిక్కర్ స్కాంలో కేసిరెడ్డి
X

ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఏ8 చాణక్యను సైతం ప్రశ్నిస్తున్నారు. ఏ1 కేసిరెడ్డిని వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్న సిట్ కేసిరెడ్డిని అన్ని విధాలుగా విచారిస్తోంది.

లిక్కర్ స్కాంలో కేసిరెడ్డి అన్నీ తానై దందా నడిపినట్లు సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తనకేం తెలియదని, స్కాంతో తనకు సంబంధం లేదని కేసిరెడ్డి వాదిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు తమ వద్ద ఉన్న ఆధారాలు, కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లను చూపి కేసిరెడ్డితో మాట్లాడిస్తున్నారు. పోలీసుల ప్రశ్నలకు నిందితుడు కేసిరెడ్డి సరైన రీతిలో సమాధానాలు చెప్పడం లేదని అంటున్నారు.

ఇక ఇదే సమయంలో ఏ8 చాణక్యను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితులు ఇద్దరిని కలిపి విచారిస్తున్నారా? లేక వేరువేరుగా ప్రశ్నిస్తున్నారా? అనే విషయమై స్పష్టత రావాల్సివుంది. కస్టడీలో కేసిరెడ్డి చెప్పే సమాచారం కేసు విచారణకు కీలకంగా మారుతుందని సిట్ అధికారులు చెబుతున్నారు. స్కాం ఎలా చేసింది? డబ్బు ఎలా తీసుకుని, ఎక్కడికి చేర్చింది? అనే విషయాల చుట్టూనే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే కేసిరెడ్డి మాత్రం అందరు నిందితులు చెబుతున్నట్లే తెలియదు, మరచిపోయా, గుర్తులేదు అన్న పదాలనే వల్లె వేస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు కేసిరెడ్డి విచారణ అప్డేట్స్ కోసం కేసులో మిగిలిన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసిరెడ్డి నోరు విప్పితే పెద్ద వికెట్లకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని చర్చించుకుంటున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ ప్రభుత్వంలో ఆయన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన క్రిష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ ప్రతినిధి బాలాజీ గోవిందప్పను అరెస్టు నుంచి మినహాయించలేమని కోర్టు తేల్చిచెప్పడంతో వారి పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి కేసిరెడ్డి విచారణ జరుగుతుండగానే మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.