విజయసాయిరెడ్డి భయం.. కసిరెడ్డి మాయం!
ఈ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించడంతో ఆయనకు ముప్పు తప్పదనే ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 10 April 2025 4:06 AMఏపీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ముఖం చాటేశారు. సిట్ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, రాజ్ కసిరెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశమవుతోంది. పైగా ఎవరికి అందుబాటులో లేకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో లిక్కర్ స్కాంపై సిట్ ఎలా ముందుకు వెళుతుందనేది ఆసక్తి రేపుతోంది.
ఏపీలో లిక్కర్ స్కాంలో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించడంతో ఆయనకు ముప్పు తప్పదనే ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాం గుట్టు మొత్తం విప్పేశారనే ప్రచారం నేపథ్యంలో ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాయమవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న వైసీపీ పెద్దలే రాజ్ కసిరెడ్డిని అండర్ గ్రౌండుకు పంపారని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. విజయసాయిరెడ్డి చెప్పిన ప్రకారం రాజ్ కసిరెడ్డి పోలీసు విచారణకు వస్తే ఇబ్బందులు ఎక్కువవుతాయని అనుమానిస్తున్న వైసీపీ పెద్ద నేతలు ఆయనను కొన్నాళ్లు అండర్ గ్రౌండుకి పంపాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి.. ఎక్కువగా లిక్కర్ వ్యాపారాన్ని పర్యవేక్షించేవారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ఓ కార్యాలయాన్ని ప్రారంభించి ప్రతి నెల రూ.60 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసేవారని, వైసీపీలో పెద్ద రెడ్డిగా భావించే ఓ కీలక నేతతో కలిసి సుమారు రూ.3 వేల కోట్లు వసూలు చేశారని సిట్ ఆధారాలు సంపాదించింది. స్కాంతో సంబంధం ఉందనే ఆరోపణలతో పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డికి వ్యతిరేకంగా కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు.
దీంతో మార్చి 28న విచారణకు రమ్మంటూ ఆ నెల 25న తొలి నోటీసు జారీ చేశారు. ఆ నోటీసుపై కసిరెడ్డి స్పందించకపోవడంతో మార్చి 29న విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరుకావాలంటూ కసిరెడ్డి తల్లికి రెండో నోటీసు అందజేశారు. అయితే ఆ నోటీసులపై స్పందించిన కసిరెడ్డి లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదని, కారణం చెబితే విచారణకు వస్తానంటూ ఈ మెయిల్ చేశారు. సాక్షిగా విచారణకు రావాలంటూ సిట్ ప్రత్యుత్తరం ఇవ్వడంతో కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 4న కసిరెడ్డి పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం సిట్ చట్ట ప్రకారమే నోటీసులు జారీ చేసినందున విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సిట్ మూడో నోటీసు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నందున కసిరెడ్డి విచారణకు సహకరిస్తారని ఆశించింది. కానీ, కసిరెడ్డి డుమ్మా కొట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాలను సిట్ పరిశీలిస్తోందని చెబుతున్నారు. విచారణకు సహకరించనందున కసిరెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఆదేశాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీలో కీలక నేతలకు లింకు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న లిక్కర్ స్కాంలో మున్ముందు సిట్ తీసుకోబోయే నిర్ణయాలు పెను సంచలనాలకు కేంద్రమవుతాయని అంటున్నారు.