''రాజ్ కసిరెడ్డిని ఎందుకు పట్టుకోలేక పోయారు?''
తాజాగా మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు.
By: Tupaki Desk | 21 April 2025 10:00 PM IST``ఏపీ మద్యం కుంభకోణంలో కర్త-కర్మ-క్రియ అన్నీ ఆయనేనని భావిస్తున్నప్పుడు.. ఆయనను ఎందుకు పట్టుకోలేక పోతున్నారు?`` అని ఏపీ పోలీసుల తరఫున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. అయితే.. దీనిపై లోతుగా స్పందించని న్యాయస్థానం.. కసిరెడ్డి వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. బెయిల్ ఇవ్వాలని.. ఆయన ఎక్కడకీ పారిపోలేదని.. న్యాయ విచారణకు సహకరిస్తారని..కసిరెడ్డి తరఫున న్యాయవాది సుధాకర్ వాదనలు వినిపించారు. అసలు మద్యంలో కుంభకోణమే లేదని.. ఇది రాజకీయప్రేరేపితమన్నారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉందన్న కారణంగానే కేసు పెట్టారని తెలిపారు. ఇవి విచారణకు నిలబడే కేసులు కాదన్నారు. అయినా.. తమ పిటిషనర్ విచారణకు సహకరిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది స్పందిస్తూ.. బెయిల్ ఇవ్వొద్దని.. ఆయన ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్నారని.. కేసులో కర్త-కర్మ-క్రియ ఆయనేనని పలువురు సాక్షులు చెప్పారని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు.. ``కర్త-కర్మ-క్రియ అన్నీ ఆయనేనని భావిస్తున్నప్పుడు.. ఆయనను ఎందుకు పట్టుకోలేక పోతున్నారు?`` అని ప్రశ్నించింది. దీనిని పొడిగించడం ఇష్టం లేదని.. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
వంశీకి ఎదురుదెబ్బ
కృష్ణాజిల్లాకు చెందిన ఓ వ్యక్తికి చెందిన భూమిని అక్రమంగా మరోవ్యక్తికి బదలాయించారన్న కేసులో.. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిపింది. అయితే.. ఈ సందర్భంగా గన్నవరం పోలీసులు.. దీనికి అభ్యంతరం తెలిపారు. కేసు విచారణ పరిధిలో ఉందని.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరఫున న్యాయవాది వాదించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో అప్పటి వరకు వంశీ విజయవాడ జైల్లోనే ఉండనున్నారు.
