హస్తినలో ఆంధ్రా రాజకీయం... జగన్ ముందు రెండు ఆప్షన్స్!
వాస్తవానికి లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కంటే ముందు 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటివరకూ పెద్దగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారినట్లు కనిపించలేదని అంటున్నారు!
By: Tupaki Desk | 21 July 2025 7:10 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా వైసీపీ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో జగన్ రెండు రకాల ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది.
అవును... ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ, వైసీపీలోని కీలక నేతలు వరుసగా అరెస్టులు అవుతున్న వేళ.. జగన్ కీలక చర్చలు జరుపుతూ సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా.. హస్తిన వెళ్లి కేంద్రంలోని పెద్దలతో చర్చలు జరపడం ఒకటి కాగా... సుప్రీంకోర్టు మెట్లెక్కడం మరొకటని అంటున్నారు.
వాస్తవానికి లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కంటే ముందు 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటివరకూ పెద్దగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారినట్లు కనిపించలేదని అంటున్నారు! అయితే.. మిథున్ రెడ్డి అరెస్ట్ అనంతరం హాట్ టాపిక్ గా మారింది. పైగా సిట్ ఛార్జ్ షీట్ లో పలుమార్లు జగన్ పేరు ప్రస్థావించడంతో ఈ విషయం వైరల్ గా మారింది.
దీనికి తోడు... ఇప్పటివరకూ అరెస్టు అయినవన్నీ చిన్న తిమింగలాలు అని.. అసలైన అతిపెద్ద తిమింగలం త్వరలో అరెస్ట్ కాబోతుందంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లోనూ ఆందోళన నెలకొందనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్.. పార్టీ ముఖ్య నేతలతో కీలక మంత్రాంగం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. తొలి ప్రయత్నంగా ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం! ఈ క్రమంలో... తానే స్వయంగా వెళ్లి ఢిల్లీలో ఈ కేసుల గురించి ఫిర్యాదు చేయాలని, కేంద్రంలోని పెద్దలకు వివరించాలనే యోచనలో ఉన్నారని అంటున్నారు.
అదే విధంగా ఢిల్లీ కేంద్రంగా తన అయిదేళ్ల కాలంతో పాటుగా 2014-19 మధ్య కాలంలో జరిగిన మద్యం లావా దేవీల గురించి వివరించాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో కూటమి ఏడాది పాలనలో ఏపీలో మధ్యం ఏరులై పారుతుందని.. బెల్ట్ షాపుల వ్యవహారం గురించి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
పైగా... హస్తినలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో వెళ్తే కలవాలనుకుంటున్న నేతలంతా అందుబాటులో ఉండే అవకాశం ఉందని పలువురు నేతలు జగన్ కు సూచించినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ లోనూ ఏపీలో కేసుల వ్యవహారం పైన ప్రస్తావించాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారని అంటున్నారు.
అయితే... కేంద్రంలోనూ టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో జగన్ ఈ ఫిర్యాదుల వ్యవహారంపై మంగళవారం అంతిమ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... ముందుగా ఈ కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచన పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏపీలో గత ప్రభుత్వ హయాంలోని లిక్కర్ స్కామ్ అంశాన్ని లేవనెత్తుతామని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ఈ విషయంలో వదిలిపెట్టేది లేదని ఏపీ బీజేపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హస్తిన కేంద్రంగా ఏపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగబోతుందనేది వేచి చూడాలి.
