రూ.3,200 కోట్లు ఎక్కడున్నాయి? లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ సమాచారం లభ్యంకాలేదా?
ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే ఆరోపణలతో పలువురు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 19 May 2025 3:30 PM ISTఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే ఆరోపణలతో పలువురు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నిందితులను కస్టడీలోకి తీసుకుని సుదర్ఘంగా విచారిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నుంచి లిక్కర్ స్కాంపై దృష్టి పెట్టింది. ముందు విజిలెన్స్ తో విచారణ చేపట్టి ఆ తర్వాత కేసును సీఐడీకి బదిలీ చేయింది. కేసును సీఐడీ కొలిక్కి తెస్తున్న సమయంలో సిట్ కు అప్పగించింది. అయితే ఏ సంస్థ దర్యాప్తు చేసినా స్కాంలో కొన్ని కీలక విషయాలపై ఆధారాలు సేకరించారా? లేదా? అన్నదే సస్పెన్స్ గా మారింది.
లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేశారు. అదేవిధంగా రాజ్ కేసిరెడ్డి సమీప బంధువులతోపాటు ఆయన స్నేహితులు కొందరిని, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సైతం నిందితుల జాబితాలో చేర్చారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డిని జైలుకు పంపారు. ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజ్ తోపాటు నిందితుల జాబితాలో ఉన్న మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డిని సిట్ విచారించింది. మిథున్ రెడ్డి, సాయిరెడ్డి మినహా మిగిలిన వారిని అరెస్టు చేసీ ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది.
అయితే సిట్ విచారణలో ఎన్నో విషయాలపై కూపీ లాగుతున్నప్పటికీ ఒక విషయంలో స్పష్టత రావడం లేదని ప్రచారం జరుగుతోంది. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యప్రసాద్ వాంగ్మూలంతో లిక్కర్ స్కాం ఎలా జరిగింది? కమీషన్లుగా ఎంత సేకరించింది. ఆ డబ్బు ఎవరి ద్వారా ఎవరికి చేరింది అనే విషయాలపై సిట్ కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఈ సమాచారంతోనే ఏ1 నుంచి ఏ33 వరకు నిందితుల జాబితాలో ఉన్నవారిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అయితే తాజాగా అరెస్టు అయిన ఏ31 ధనుంజయరెడ్డి, ఏ2 క్రిష్ణమోహన్ రెడ్డి విచారణ తర్వాత అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
లిక్కర్ స్కాంలో నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు కమీషన్లుగా దండుకున్నారని తొలి నుంచి ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇలా మొత్తం రూ.3,200 కోట్లు సేకరించారని అంటున్నారు. అయితే ఈ డబ్బు అంతా ఎక్కడుంది? ఎవరికి చేరింది? అంతిమ లబ్ధిదారు ఎవరు? అన్న విషయాలపై ఇంకా క్లారిటీ రావడం లేదని అంటున్నారు. సుమారు పది నెలలుగా స్కాంపై పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తున్నా, కమీషన్ గా వసూలు చేసిన మొత్తంలో ఒక్క రూపాయిని కూడా సీజ్ చేయలేదు. సరికదా, ఆ మొత్తం ఎక్కడుంది? ఏ రూపంలో ఉందన్న విషయంపైనా సమాచారం సేకరించలేదన్న ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం నిందితులు ఎవరూ కూడా అంతిమ లబ్దిదారు పేరు చెప్పడం లేదని, స్కాం జరగలేదన్న వాదనకే కట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.
దీంతో లిక్కర్ స్కాంలో పేర్కొన్న రూ.3,200 కోట్లు ఏ రూపంలో ఉన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారని అంటున్నారు. అయితే షెల్ కంపెనీల ద్వారా కొంత మొత్తం విదేశాలకు తరలించారని, బంగారం రూపంలో నిల్వ చేశారని ప్రచారం జరుగుతున్నా, ఎవరి నుంచి ఎవరికి ఏ రూపంలో నగదు బదిలీ అయిందనే విషయమై క్లారిటీ రావడం లేదు. అయితే స్కాంపై ఈడీ రంగ ప్రవేశం చేయడం, ఈడీ దర్యాప్తు ఎక్కువగా డబ్బు ఫ్లో పైనే ఉండే అవకాశం ఉండటంతో రూ.3,200 కోట్లు ఎక్కడున్నది త్వరలో తెలుస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సిట్ దర్యాప్తులో అంతిమ లబ్ధిదారును ఇప్పటివరకు గుర్తించలేకపోవడం, కమీషన్ గా వసూలు చేసిన రూ.3,200 కోట్ల లెక్క బయట పెట్టకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
