Begin typing your search above and press return to search.

'గోల్డ్'గుట్టల్లో లిక్కర్ గుట్టు.. ప్రభుత్వానికి ఎప్పుడో చిక్కిన బంగారం లెక్కలు?

దాదాపు రూ.3,200 కోట్ల విలువైన స్కాం జరిగిందని ప్రచారం జరుగుతుండగా, ఈ డబ్బులో ఎక్కువ మొత్తం బంగారం రూపంలో దాచారనే విషయం తాజాగా బయటపడింది

By:  Tupaki Desk   |   21 May 2025 1:00 AM IST
గోల్డ్గుట్టల్లో లిక్కర్ గుట్టు.. ప్రభుత్వానికి ఎప్పుడో చిక్కిన బంగారం లెక్కలు?
X

ఏపీ లిక్కర్ స్కాంలో రోజుకొక ఆసక్తికర విషయం వెలుగుచూస్తోంది. దాదాపు రూ.3,200 కోట్ల విలువైన స్కాం జరిగిందని ప్రచారం జరుగుతుండగా, ఈ డబ్బులో ఎక్కువ మొత్తం బంగారం రూపంలో దాచారనే విషయం తాజాగా బయటపడింది. వాస్తవానికి ఈ సమాచారం ప్రభుత్వానికి దర్యాప్తు అధికారులకు ఎప్పుడో తెలిసినా నిందితుల అరెస్టు తర్వాతే ఆ గుట్టు విప్పారని అంటున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్న బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీల సందర్భంగానే లిక్కర్ స్కాంపై పూర్తి సమాచారం పోలీసులకు లభ్యమైనట్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కీలక పత్రాలను మాయం చేయాలని భావించిన వాసుదేవరెడ్డి అతి జాగ్రత్తే లిక్కర్ స్కాంను బయటపెట్టిందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి మద్యంలో కుంభకోణానికి పాల్పడుతున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపించినా, కూటమి అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే వాసుదేవరెడ్డి మూలంగా కీలక పత్రాలు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. స్కాం వివరాలు ఎవరికీ తెలియకుండా చేయాలని భావించిన వాసుదేవరెడ్డి విజయవాడలో తన కార్యాలయం ఖాళీ చేస్తూ పోలీసులకు దొరికిపోయారని చెబుతున్నారు. ఒకటో రెండో ఫైల్స్ దాచేస్తే స్కాం గుట్టు దాయడం సాధ్యం కాదని భావించిన వాసుదేవరెడ్డి విజయవాడలో తన కార్యాలయం మొత్తాన్ని ఖాళీ చేయాలని భావించడమే ప్రభుత్వానికి కీలక పత్రాలు లభించినట్లు చేసిందని అంటున్నారు.

తొలుత వాసుదేవరెడ్డిపై కీలక పత్రాల మాయం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ పత్రాలను చూసి ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు. వాసుదేవరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో వందల కిలోల బంగారం కొనుగోలు చేసిన బిల్లులు ఉన్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బంగారాన్ని గ్రాముల్లో కొనుగోలు చేస్తుంటారు. గరిష్ఠంగా పది, ఇరవై గ్రాములు కొనాలంటేనే ఎన్నో లెక్కలు చెప్పాల్సివుంటుంది. కానీ, వాసుదేవరెడ్డి వద్ద లభ్యమైన పత్రాల్లో బంగారం కిలోల లెక్కన కొనుగోలు చేసినట్లు బిల్లులు ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించడంతో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించినట్లు చెబుతున్నారు.

కాగా, కేంద్ర సర్వీసులకు చెందిన వాసుదేవరెడ్డిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు డిప్యుటేషన్ పై రాష్ట్రానికి తెచ్చారు. ఆయనకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీతోపాటు మరికొన్ని కీలక పోస్టులను ఆయనకు కట్టబెట్టారు. అయితే ఇప్పుడు ఆయన వల్లే జగన్ కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కాంలో కీలక నిందితులను అరెస్టు చేసిన సిట్.. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని మాత్రం ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాసుదేవరెడ్డి కూడా అప్రూవర్ గా మారిపోయారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి సహకరిస్తుండటం వల్లే రాష్ట్రం నుంచి రిలీవ్ చేసి తిరిగి తన మాతృ సంస్థకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారంటున్నారు. మొత్తానికి కిలోల లెక్కన కొనుగోలు చేసిన బంగారమే లిక్కర్ కేసు డొంకను కదిలిచిందని ప్రచారం జరుగుతోంది.