లిక్కర్ స్కాంలో బిగ్ అప్డేట్.. 5 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
లిక్కర్ స్కాంలో చాలా కాలం క్రితమే కేసు నమోదు చేసిన ఈడీ ఇంతవరకు పెద్దగా ఫోకస్ చేయలేదు.
By: Tupaki Desk | 18 Sept 2025 1:37 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.3,500 కోట్ల విలువైన కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) నిందితులకు షాక్ ఇచ్చింది. గురువారం ఉదయం నుంచి ఐదు రాష్ట్రాల్లో నిందితులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో తనఖీలు చేపట్టింది. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కుంభకోణంపై సీఐడీ సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇది కొనసాగుతుండగానే సమాంతరంగా ఈడీ దర్యాప్తు చేపట్టడంతో నిందితుల్లో గుబులు రేగుతోంది.
లిక్కర్ స్కాంలో చాలా కాలం క్రితమే కేసు నమోదు చేసిన ఈడీ ఇంతవరకు పెద్దగా ఫోకస్ చేయలేదు. దీంతో ఈ కేసును ఈడీ సీరియస్ గా తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వ వర్గాలతోపాటు, ప్రభుత్వ అనుకూల మీడియాలోనూ ఈ అంశంపై ఈడీ వ్యవహరిశైలి సరిగా లేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏపీ మద్యం స్కాం మాదిరిగానే ఢిల్లీ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో జరిగిన లిక్కర్ స్కాంపై ఈడీ కేసు నమోదు చేసి అరెస్టులు చేసింది. కానీ, ఏపీ లిక్కర్ స్కాంపై ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఈడీ చర్యలు లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఈడీ తనిఖీలకు ఉపక్రమించడం సంచలనంగా మారింది.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాసికరమైన మద్యం అమ్మకాలు జరిపారని, కమీషన్ కింద వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని ఏ1గా గుర్తించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితోపాటు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు 29 మంది వ్యక్తులను 19 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. అంతిమ లబ్ధిదారును గుర్తించే దిశగా సిట్ దర్యాప్తు సాగుతుండగా, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా రంగంలో దిగడం ఉత్కంఠ రేపుతోంది.
ఈ ఏడాది మే నెలలో లిక్కర్ స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. నిందితులను నోటీసులు జారీ చేసి వాంగ్మూలం తీసుకుంది. సీఐడీ అరెస్టు చేసిన నిందితులు రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డిని జైలులోనే విచారించింది. ఆ తర్వాత సుమారు నాలుగు నెలలపాటు ఈ వ్యవహారంపై గుంభనంగా ఉన్న ఈడీ ఈ రోజు అనూహ్యంగా తనిఖీలకు దిగడం నిందితులకు టెన్షన్ పుట్టిస్తోందని అంటున్నారు. ఈ తనిఖీల తర్వాత ఈడీ కూడా అరెస్టులు చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
