Begin typing your search above and press return to search.

కోర్టులో ఏడ్చేసిన చెవిరెడ్డి..? నాటి ధైర్యం ఏమైపోయింది?

ఏపీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న వైసీపీ నేతలలో ధైర్యం సడలిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 Aug 2025 11:41 PM IST
కోర్టులో ఏడ్చేసిన చెవిరెడ్డి..? నాటి ధైర్యం ఏమైపోయింది?
X

ఏపీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న వైసీపీ నేతలలో ధైర్యం సడలిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్కాం పేరిట తమను అన్యాయంగా ఇరికించేశారని, తమ తప్పు లేదని చెప్పడమే కాకుండా.. 2029లో అధికారంలోకి వైసీపీనే అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరికీ సినిమా చూపిస్తామంటూ ఇన్నాళ్లు బెదిరింపులకు దిగిన నిందితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయారంటున్నారు. హెచ్చరికలకు బదులుగా బెయిలుపై తమను వదిలేయాలని బ్రతిమిలాడుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మంగళవారం లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ గడువు పూర్తవడంతో నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని, జైలు జీవితాన్ని తట్టుకోలేకపోతున్నానని చెబుతూ ఏడ్చేశారని కథనాలు వస్తున్నాయి.

మద్యం స్కాంలో దాదాపు రూ.250 కోట్లు వరకు నగదును చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని సిట్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలు సేకరించినట్లు చెబుతూ చెవిరెడ్డితోపాటు ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడిని అరెస్టు చేశారు. అయితే తనను అన్యాయంగా అరెస్టు చేశారని, తన తండ్రి, సోదరుడు మద్యానికి బలైపోయారని చెప్పడమే కాకుండా, మద్యం ద్వారా అన్యాయంగా డబ్బు సంపాదించాలనే మనిషి కాదని, అసలు తనకు మద్యం అలవాటు కానీ, ఆ నీచమైన వ్యాపారంతో సంబంధమే లేదంటూ చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. అదే సమయంలో కోర్టులో హాజరుపరిచిన సమయంలోనూ, జైలుకు వెళ్లివస్తున్నప్పుడు ప్రభుత్వానికి పోలీసులకు తీవ్ర స్థాయిలో హెచ్చరించేవారు. తానేంటో చూపిస్తానంటూ నానా హంగామా చేసేవారని అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ఇప్పుడు చెవిరెడ్డిలో మునుపటి ధైర్యం కనిపించడం లేదని, మంగళవారం కోర్టులో ఆయనను చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి మంగళవారం చెవిరెడ్డితోపాటు ఇతరుల రిమాండ్ ముగిసిపోయింది. అయితే తనను వర్చువల్ పద్ధతిలో కోర్టులో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి కోర్టుకు విన్నవించారని చెబుతున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులు న్యాయమూర్తికి నివేదించగా, ఆయన అందుకు అంగీకరించలేదని చెబుతున్నారు. దీంతో చెవిరెడ్డి కోర్టుకు హాజరుకాక తప్పలేదు. ఇక కోర్టులో అడుగు పెట్టిన తర్వాత న్యాయమూర్తిని చూసి చెవిరెడ్డి బోరున ఏడ్చేశారని అక్కడ వారు చెబుతున్నారు. తనకు తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, ఈ విషయాన్ని జైలు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని చెవిరెడ్డి వాపోయినట్లు సమాచారం. తనకు తక్షణం వైద్య సహాయం అందాల్సివున్నందున బెయిలు ఇప్పించాల్సిందిగా కన్నీరు పెడుతూ చెవిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారని అంటున్నారు. అయితే ఆయన వేదనను విన్న న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఆ రోజు చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు వినే అవకాశం ఉందంటున్నారు.

ఇక ఎంతో ధైర్యవంతుడిగా భావించిన చెవిరెడ్డి కన్నీరు కార్చారంటూ జరుగుతున్న ప్రచారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. లిక్కర్ కేసులో తన పాత్రపై ఎటువంటి ఆధారం లేదని, తనకు కేసుతో సంబంధం లేదని చెవిరెడ్డి ఇంతవరకు చెబుతూ వచ్చారు. అయితే ఆయన పాత్రకు సంబంధించిన బలమైన ఆధారాలను చూపి బెయిలు దక్కకుండా సిట్ అడ్డుకుంటోందని అంటున్నారు. దీంతో జైలులో ఉండలేకపోతున్న చెవిరెడ్డి బయటకు రావాలనే ఆలోచనలో బెయిలు కోసం తీవ్ర న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన అనారోగ్యం బాగాలేదన్న సమాచారం, వెన్నునొప్పి కారణంగా బెయిలు ఇవ్వాలని కన్నీరుపెట్టుకుని ప్రాధేయపడటంతో చెవిరెడ్డి అనుచరులు సైతం తమ నేత కోసం తల్లడిల్లిపోతున్నారు.