తూచ్.. నాలిక కరుచుకున్న టీడీపీ మీడియా.. వైఎస్ భారతీ రెడ్డే.. కానీ, కాదు!
ఏపీ లిక్కర్ స్కాంలో సీఐడీ సిట్ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొందరు నేతలు, సీనియర్ అధికారుల ప్రమేయంపై అభియోగాలు నమోదయ్యాయి.
By: Tupaki Desk | 23 Sept 2025 2:54 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో విపక్ష నేతలు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహరెడ్డి టార్గెట్ గా కథనాలు ప్రసారం చేస్తున్న టీడీపీ మీడియాకు తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. ఈ స్కాం వెలుగు చూసిన నుంచి సిట్ ద్వారా సమాచారం సేకరిస్తూ సంచలన కథనాలు రాస్తున్న రెండు పెద్ద పత్రికలు చిన్న పొరపాటుతో అడ్డంగా బుక్కయ్యాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టార్గెట్ ముందుగా ఫిక్స్ చేసుకుని వెనుకా ముందు ఆలోచించకుండా వార్తలు రాయడం వల్ల ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారని అంటున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో సీఐడీ సిట్ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొందరు నేతలు, సీనియర్ అధికారుల ప్రమేయంపై అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం 40 మంది వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో చేర్చగా, సుమారు 12 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఇదే సమయంలో ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్.. మాజీ సీఎం జగన్ సమీప బంధువుల ఆఫీసులు, ఇళ్లల్లో ఇటీవల సోదాలు నిర్వహించింది.
లిక్కర్ స్కాంలో కమీషన్లను అంతిమ లబ్దిదారుకు చేర్చడంలో కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని అనుమానిస్తున్న సిట్.. వాటిని గుర్తించే పనిలో భాగంగా మాజీ సీఎం జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇంటి తలుపు తట్టింది. ఆయనకు చెందిన ఇళ్లు కార్యాలయాల్లో కొద్దిరోజుల క్రితం తనిఖీలు చేయగా, ఓ కంపెనీలో వైఎస్ భారతీరెడ్డి 2020 వరకు డైరెక్టర్ గా ఉన్నట్లు గుర్తించింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ అనుకూల మీడియా లిక్కర్ స్కాంలో మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డికి కూడా లింకు ఉన్నట్లు కథనాలు ప్రసారం చేసింది.
అయితే వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన ఏ కంపెనీలోనూ తాను డైరెక్టరుగా పనిచేయకపోవడంతో తప్పుడు కథనాలు రాశారని, తన ప్రతిష్టకు భంగం కలిగించారని జగన్ సతీమణి భారతి రెడ్డి ఓ ప్రధాన పత్రికకు లీగల్ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. సిట్ సేకరించిన రికార్డుల్లో వైఎస్ భారతీ రెడ్డి పేరు ఉన్నా, ఆ కంపెనీతో తనకు సంబంధం లేదని జగన్ సతీమణి గట్టిగా వాదించడంతో అసలు ట్విస్టు వెలుగుచూసింది. జగన్ పెదనాన్న జార్జిరెడ్డి సతీమణి పేరు కూడా భారతీరెడ్డి కావడం విశేషం.
అయితే ఈ తేడాను గమనించని టీడీపీ మీడియా అత్యుత్సాహంతో జగన్ సతీమణి భారతిరెడ్డిగా పొరపడి కథనాలు రాయడంతో ఆమె పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. మరోవైపు తమ తప్పు తెలుసుకున్న ఓ పత్రిక ఈ రోజు ప్రత్యేకంగా ఓ వార్త రాస్తూ గతంలో తాము రాసిన వార్తలో ఆరోపించిన విధంగా జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి కాదని స్పష్టం చేస్తూ వివరణ ఇచ్చుకుంది. ఇలా పెద్ద పత్రికలు సంచలన కథనాలు రాసిన సందర్భంలో వివరణ ఇచ్చుకునే పరిస్థితి తలెత్తడం అవమానంగా భావించాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
